ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం

టీడీపీ కార్యకర్త అఘాయిత్యం

నిందితుని వద్ద రాడ్డు లభ్యం.. పోలీసులకు అప్పగింత 

తాడికొండ: గుంటూరు జిల్లా బాపట్ల వైయ‌స్ఆర్ ‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు గురువారం రాత్రి దాడికి యత్నించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరగా.. ఎదురుగా వచ్చిన పూర్ణచంద్రరావు తన బైక్‌ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు.

ఎవరని ప్రశ్నించగా దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతనిని పట్టుకుని వెతగ్గా ఇనుప రాడ్డు బయటపడింది. ఇంతలో నిందితుడు సమీపంలోని అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లోకి పారిపోగా భద్రతా సిబ్బంది మళ్లీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే లోగానే మద్యం మత్తులో ఉన్న పూర్ణచంద్రరావు తనపై దాడికి యత్నించాడని తెలిపారు.    

Back to Top