వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా టంగుటూరి జ‌యంతి

తాడేప‌ల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల‌ అప్పిరెడ్డి, పార్టీ కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాప్‌రెడ్డి, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు ప్ర‌కాశం పంతులు చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  

అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ స్పూర్తితో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని గుర్తుచేశారు. ఒక మంచి న్యాయవాదిగా మద్రాసులో పనిచేసి ఆయ‌న‌ సంపాదించిన యావదాస్తిని స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహనీయుడన్నారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచి, తన గుండెను చూపిన ఆంధ్రకేసరి టంగుటూరి అని అన్నారు. ప్ర‌కాశం పంతులు ముఖ్యమంత్రిగా పనిచేసిన అతి స్వల్ప కాలంలోనే కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించే రీతిలో ప్రకాశం బ్యారేజి నిర్మాణానికి బీజం వేసిన రైతు శ్రేయోభిలాషి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆయనను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 

అనంత‌రం ఎమ్మెల్సీ లేళ్ల‌ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ నేతగా టంగుటూరి ప్రకాశం పంతులును అభివర్ణించారు. పేదరికంలో పుట్టినా కష్టపడి పెద్ద చదువులు చదివి, తన యావదాస్తిని దేశం కోసం, దేశ స్వాతంత్య్రం కోసం నిస్వార్ధంగా ధారపోసిన దేశభక్తుడు అని కీర్తించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి నేటి ప్రభుత్వానికి స్పూర్తిగా నిలిచిన మార్గదర్శకుడన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను పునాదిగా చేసుకుని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమాజంలో పేదరిక నిర్మూలన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top