ఆత్మకూరు ఘటన దుర్మార్గం

మృతురాలి పిల్లలను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

నెల్లూరు: ఆత్మకూరులో మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ కొండమ్మ మృతి అత్యంత హేయమైన సంఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. నిత్యం గృహహింస తాళలేక కొండమ్మ ఆత్మహత్య చేసుకోవడం.. ఘటనా స్థలంలోనే ఉన్న ఆమె భర్త ప్రాణాలను కాపాడకపోగా.. వీడియో తీసి పైశాచికానందం పొందడంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మకూరు పట్టణంలోని జె.ఆర్‌ పేటలో నివాసం ఉంటున్న మృతురాలు కొండమ్మ పిల్లలను వారి కుటుంబ సభ్యులను మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. భార్య అంటే చిన్నచూపు, ఆమెపై సర్వహక్కలున్నాయనే పెంచలయ్య వంటి మృగాళ్లకు తగిన బుధ్ధి చెప్పేందుకు మహిళా కమిషన్‌ వెనుకాడదన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. ఏ చిన్న సంఘటనలను కూడా రాష్ట్ర పోలీస్‌ స్పందించే విధంగా దిశ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ప్రచారం చేస్తూ ఉన్న కూడా దానిని ఉపయోగించుకునే అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర సచివాలయ పోలీస్‌ వ్యవస్థ ద్వారా మరింతగా దిశ యాప్‌ గురించి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. కొండమ్మ మృతికి ప్రత్యక్షంగా కారకుడైన ఆమె భర్తను కఠినంగా శిక్షించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు. 

మహిళకు అరచేతి రక్షణగా ఉన్న ’దిశ’ యాప్‌ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవమానాలు ఎదుర్కొంటున్న మహిళలు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడి.. మరణమే శరణ్యమనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. దిశ బిల్లు ప్రతులను తగులబెట్టిన నారా లోకేష్‌ వంటి ప్రబుద్ధులే ఆత్మకూరులో పెంచలయ్యలాంటి కసాయిలను పెంచిపోషిస్తున్నారని వాసిరెడ్డి ప‌ద్మ‌ ఘాటుగా స్పందించారు. 

Back to Top