రాజమండ్రి: ఈనాడు పత్రికను అడ్డం పెట్టి చంద్రబాబు బీసీలను అణగదొక్కే కుట్రలు చేస్తున్నాడని, తూర్పు గోదావరి జిల్లాలో బీసీల జనాభాపై ఈనాడులో వచ్చిన తప్పుడు లెక్కలే అందుకు నిదర్శనమని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓడినా గెలిచినా టీడీపీలో రాజమండ్రి ఎంపీ సీటు ఎప్పటికీ కమ్మ సామాజికవర్గానికేనని చంద్రబాబు ఫిక్స్ అయిపోయాడని, కానీ వైయస్ జగన్ గారు బీసీలకు కేటాయిస్తుంటే చూసి ఓర్వలేక బీసీ జనాభా లెక్కల విషయంలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. 1994లోనే మరళీధర్ కమిషన్ నివేదిక ప్రకారం తూర్పుగోదావరిలో బీసీల జనాభా 50 శాతం ఉంటే, ఇప్పుడు 29 శాతమేనని ఈనాడు ఎలా రాస్తుందని ప్రశ్నించారు. సూపర్‌సిక్స్ పథకం ఆడబిడ్డ నిధి అమలు చేస్తే రాష్ట్రం అప్పులపాలవుతుందని మాటమార్చిన కూటమి, మూడో బిడ్డకి రూ.30వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు ఇస్తామని చెబితే మాత్రం మాట తప్పరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. మహిళలను చంద్రబాబు పిల్లలను కనే యంత్రాలుగానే చూస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించకపోతే ఎక్కువమంది ఉన్న కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందని హెచ్చరించారు. దీనికి చంద్రబాబు ఏం భరోసా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... బీసీలకు వ్యతిరేకంగా ఈనాడు కుట్రలు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఈనాడు పత్రిక బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. రాష్ట్ర జనాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్యను ప్రస్తావించిన ఈనాడు.. బీసీల సంఖ్యను కావాలనే ప్రస్తావించలేదు. బీసీల జనాభా సంఖ్యను గనుక రాస్తే చంద్రబాబుకి ఇబ్బంది అనే కారణంతోనే బీసీల జనాభా గురించి రాయలేదు. 1994లోనే మురళీధర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం ఉన్నారని చెబితే, ఇప్పుడు ఈనాడు రాసిన లెక్కల ప్రకారం 50 శాతమేనని తేల్చింది. వాస్తవంగా లెక్కలకడితే బీసీల జనాభా 60 శాతానికి పైగానే ఉంటుంది. ఈనాడు పత్రిక పద్ధతి ప్రకారం పనిగట్టుకుని బీసీలను అణగదొక్కే కుట్రలు చేస్తోంది. నిన్నటి పత్రికలో తూర్పు గోదావరి జిల్లాలో బీసీల జనాభా 29 శాతమేనని రాశారు. ఈరోజు చూపించిన లెక్కల ప్రకారం మొత్తం 22 లక్షల జనాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు పోను బీసీలు 50 శాతమని తేలింది. బీసీల జనాభా నిష్ఫత్తిని దృష్టిలో ఉంచుకుని వైయస్ జగన్ గారు రాజమండ్రి ఎంపీ సీటును బీసీలకు కేటాయించారు. కానీ టీడీపీ మాత్రం ఓసీలకు కేటాయించింది. బీసీల సంఖ్య 50 శాతం ఉందని తెలిస్తే టీడీపీ కూడా ఈ సీటును బీసీలకే కేటాయించాల్సి వస్తుందనే అక్కసుతోనే ఈనాడు తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. గతంలో మా నాన్నగారు రాజమండ్రి ఎంపీ సీటుని బీసీలకు కేటాయించాలని చంద్రబాబుని అడిగితే ఒక సీటు కోల్పోయిన ఇష్టమే కానీ, ఈ సీటుని కమ్మ వారికి తప్పితే ఇతరులకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆడవారు పిల్లలను కనే యంత్రాలా? ఆడవారిని పిల్లలను కనే యంత్రాలుగా చంద్రబాబు భావిస్తున్నాడు. మూడో బిడ్డను కంటే 30 వేలు, నాలుగో బిడ్డను కంటే 40 వేలు ఇస్తానని చెబుతున్నాడు. మరి చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్‌లు ఎందుకు ఒక్కరితోనే సరిపెట్టారు? కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ఒకరిద్దరి పిల్లలకే ఉచిత విద్య, వైద్యం అందించని చంద్రబాబు.. ముగ్గురు, నలుగురేసి పిల్లల్ని కంటే వారి బతుకులు ఏమైపోవాలి. వారి జీవన ప్రమాణాలు పెంచడానికి చంద్రబాబు ఏం భరోసా ఇస్తాడు? కుటుంబ నియంత్రణ పాటించడం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలో మానవ జీవన ప్రమాణాలు పెంచాడని 2013లో టీడీపీ ట్వీట్ చేసింది. ఇప్పుడు మాత్రం ముగ్గురు, నలుగురేసి పిల్లల్ని కనాలని ప్రచారం చేస్తున్నాడు. ఆడబిడ్డ నిధి పేరిట ఒక్కో మహిళకు నెలకు రూ. 1500 ఇస్తానని చెప్పి చంద్రబాబు వంచించాడు. దాని గురించి అడిగితే మహిళలకు ఏడాదికి రూ. 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పాడు. చంద్రబాబు చెప్పే రూ. 30 వేలు, రూ. 40 వేలు కూడా అలానే ఉంటుంది. ఆయన మాటలు నమ్మితే మునిగిపోయినట్టే. ఆనాడు వైయస్ జగన్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగు భాషని చంపేస్తున్నారని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దుష్ర్పచారం చేశారు. తమ పిల్లలతో సమానంగా రాష్ట్రంలో పేదల పిల్లలెవరూ ఇంగ్లిష్ మీడియంలో చదవకూడదని కుట్ర చేశారు. కానీ నేడు లోకేష్ తన కొడుకుని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిస్తున్నాడు. పెట్రోల్, డీజిల్‌పై 50 శాతం వ్యాట్ ఎప్పుడు తగ్గిస్తారు? కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ లపై ఉన్న వ్యాట్ 50 శాతం తగ్గిస్తామని, చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు, లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రచారం చేశారు. చివరికి కూటమి మేనిఫెస్టోలోనూ పెట్రోల్ డీజిల్ చార్జీలు నియంత్రిస్తామని చెప్పారు. కానీ రెండేళ్లుగా ధరలు తగ్గించకపోగా ఏపీని పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలోనే నెంబర్ వన్ చేసేశారు. కేంద్రం ధరలు పెంచితే దుబారా ఖర్చులు తగ్గించాలని సెలవిచ్చారు. ఒకపక్క కేబినెట్ జరుగుతుండగానే మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో వెళ్లాడు. మర్నాడే చంద్రబాబు మరో ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వెళ్లాడు. నా సొంత డబ్బుతోనే తిరుగుతున్నానని చెప్పే లోకేష్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలా ప్రత్యేక విమానంలో తిరగలేదు? మరో రీల్స్ మంత్రి రామానాయుడు సైకిల్ తొక్కుతూ వెనుక కార్లతో సెక్యూరిటీని పరుగులు పెట్టించాడు. పైన డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం ఊదరగొట్టాడు. కారుల్లో తిరిగేదానికన్నా సైకిల్ తొక్కి ఇంకా ఎక్కువ ఖర్చు చేశారు. ఈ రీల్స్ మంత్రి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేవరకు కారు ఎక్కనని శపథం చేయాలి. అవినీతి మయంగా పుష్కరాల పనులు మార్గాని భరత్ పేరుతో ఎక్కడ శిలాఫలకం కనపడితే దాన్ని ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పగలగొట్టిస్తున్నాడు. శిలాఫలకం పగలగొట్టడంలో ఉన్న శ్రద్ధ రోడ్లు వేయడంలో లేదు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద వైయస్ జగన్ గారు రాజమండ్రికి రూ. 125 కోట్లు కేటాయించారు. అందులో రిఫర్ ఫ్రంట్ కోసం రూ. 22 కోట్లు కేటాయించి వైయస్ఆర్‌సీపీ హయాంలో శంకుస్థాపనులు చేస్తే దాన్ని మూడు భాగాలుగా విభజించి ఇప్పుడు పనులు చేస్తున్నారు. గతంలో పుష్కరాల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే కాంపౌండ్ వాల్ నిర్మించాలి. తూతూమంత్రంగా పనులు చేసి నిధులు కాజేసే కుట్రలు చేస్తున్నారు.