వైయస్‌ఆర్‌ స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలి 

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

అమరావతి: నల్లకాల్వ సమీపంలో ఏర్పాటైన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఏకో టూరిజమ్‌ కింద స్మృతివనాన్ని తీర్చిదిద్దాలని, నిర్వాహణకు బడ్జెట్‌ కేటాయింపుల్లో నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైయస్‌ఆర్‌ స్మృతివనం, మహానంది మండలంలోని అరటి రైతుల సమస్యలపై మాట్లాడారు. చక్రపాణిరెడ్డి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 2009, సెప్టెంబర్‌ 2న శ్రీశైలం నియోజకవర్గం  నల్లకాల్వ సమీపంలోని పావురాల గుట్టలో హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు. ఆ మహనీయుడు మా ప్రాంతంలో చనిపోవడం చాలా దురదృష్టకరం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ రోజు సీఎంగా ఉన్న రోశయ్య  వైయస్‌ రాజశేఖరరెడ్డికి గుర్తుగా నల్లకాల్వ సమీపంలో వైయస్‌ఆర్‌ స్మృతివనం ఏర్పాటు చేయించారు. 2012వ సంవత్సరం 23 ఎకరాల స్థలంలో రూ.13 కోట్ల నిధులతో నల్వ కాల్వ వద్ద స్మృతివనం ఏర్పాటు చేశారు. ఇటీవలే సీఎం వైయస్‌ జగన్‌ను కలిసి స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలని కోరాం. పావురాల గుట్టను ఏకో టూరిజమ్‌ కింద వెలుగోడు బ్యాలెన్సింగ్‌రిజర్వాయర్, సిద్ధాపురం చెరువులను కలుపుతూ అభివృద్ధి చేయాలని సీఎంను కోరాం. ఇందుకు సీఎం వైయస్‌ జగన్‌ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాంతం టైగర్‌ పారెస్ట్‌లో ఉండటంతో అటవీ అనుమతుల్లో కొంత జాప్యం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. స్మృతివనంలో దాదాపు 32 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో  10మంది సెక్యూరిటీ గార్డులు, 21 మంది తోటమాలీలు, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ పని చేస్తున్నారు. వీరికి గౌరవ వేతనంగా కట్టింగ్స్‌ పోనూ నెలకు రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారు. రూ.7 వేలతో కుటుంబ పోషణ కష్టమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి వరకు ఎలాంటి జీతాలు పెంచలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్న సిబ్బందికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు పెంచాలని కోరాం. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక చాలా మందికి గౌరవ వేతనాలు పెంచారని, స్మృతివనంలో పని చేసే సిబ్బంది వేతనాలు కూడా పెంచాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సభా వేదికగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. 
వైయస్‌ఆర్‌ స్మృతివనానికి ఏపీ గ్రీనరీ అవార్డు కూడా వచ్చినట్లు సభలో వెల్లడించారు. 
స్మృతివనం నిర్వాహణకు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా పెంచాలని కోరారు. 
శ్రీశైలం నియోజకవర్గంలోని మహనంది మండలంలో  మూడు రోజుల క్రితం ఈదురుగాలులకు అరటి తోటలు నేలకూలాయి. అరటి పంటలకు ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరటి పంటకు కూడా ఇన్సూరెన్స్‌ వర్తించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి సభలో కోరారు. 
 

Back to Top