తాడేపల్లి: మహనీయులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ పరిపాలన సాగుతోందని, దేశ చరిత్రలోనే తొలిసారిగా 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించి సామాజిక విప్లవానికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకున్న ముఖ్యమంత్రిగా, బడుగుల అభివృద్ధి కోసం నిరంతర శ్రామికుడిగా, బలహీన వర్గాలను ఆకట్టుకునేలా, మైనార్టీలకు తోడుగా ఉన్న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఉన్నారని చెప్పడానికి చాలా గర్విస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున ఇంకా ఏమన్నారంటే.. సంక్షేమ పథకాలు అమలులోగానీ, రాజకీయ పదవుల్లోగానీ దేశ చరిత్రలోనే మేటిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. ఈ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. సామాజిక విప్లవానికి నాంది పలికిన తొలి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చెప్పుకోవాలి. బాబు కేబినెట్‌లో ఎస్టీ, మైనార్టీలకు స్థానమే లేదు ఇంతకాలం ఏ వర్గాలైతే అణచివేయబడ్డాయో, ఆ వర్గాల ఉన్నతి కోసం ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి.. కనీసం మనసు అనేది లేకుండా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, చంద్రబాబు నాయుడు, ఆయన ఆడమన్నట్టు అల్లా ఆడే ఎల్లో మీడియా, కొంతమంది తోలుబొమ్మలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తన కేబినెట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవుల ఇచ్చారు? ఎంతమంది ఎస్సీ, ఎస్టీలను మంత్రులను చేశాడు? 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కేబినెట్‌లో ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి అయినా చోటు కల్పించాడా..? అంటే లేదు. చంద్రబాబు కేబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు కేవలం 42 శాతం ఇస్తే.. సీఎం వైయస్ జగన్ తొలి కేబినెట్ లో 60 శాతం, ఇప్పుడు కేబినెట్ విస్తరణలో 70 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా 70శాతం మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబుది, తన సామాజికవర్గం కోసం చేసే న్యాయమే తప్ప.. సామాజిక న్యాయం ఎప్పుడూ చేయలేదు, చేయడు. చంద్రబాబు హయాంలో దళితులు నిత్యం భయభ్రాంతులతో బతికే పరిస్థితి తెచ్చాడు. చివరకు బీసీలను కూడా తోకలు కత్తిరిస్తా అంటూ భయపెట్టిన మాటలను రాష్ట్ర ప్రజలంతా చూశారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఒక దళిత మహిళను హోంమంత్రిని చేశారా? ఎడ్యుకేషన్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సెస్ శాఖలు దళితులకు ఎప్పుడైనా చంద్రబాబు ఇచ్చారా? చంద్రబాబు చరిత్ర చూస్తే దళతులను అణగదొక్కాలని, బహుజనులను భయపెట్టాలని, మా ఆస్తులను కొల్లగొట్టాలని, మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను తుంగలోకి తొక్కాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. ఇది మా పాలన గర్వంగా చెప్పే పరిస్థితి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు ఏనాడు కూడా దళితులు, బీసీల సంక్షేమం కోసం కనీసం ఆలోచన చేయలేదు. ఎంతసేపటికీ వాళ్ళను ఓట్లు వేసే యంత్రాలుగానే చూశాడు తప్పితే, వారి అభ్యున్నతి కోసం మేలు చేయాలన్న ఆలోచనే చేయలేదు. నేడు వైయస్ జగన్ పరిపాలనలో బడుగు, బలహీనవర్గాలంతా.." ఇది మా పాలన అని తలెత్తుకుని, గర్వంగా చెప్పుకునేలా" చేశారు. జగనన్న పరిపాలనలో ఈ వర్గాల ప్రజలంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి బాటలు పడుతున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు, తెలిసినా, వాస్తవాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు..?. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్ళూ ఏ ఒక్క మేలు చేయలేదు కాబట్టే, రాజకీయంగా అవసరం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ బొమ్మను తెరపైకి తెస్తాడు. వైయస్ జగన్ పరిపాలన నభూతో నభవిష్యతి రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ పరిపాలన, బహుజనులు, బడుగుల కోసం ఆయన తెస్తున్న సంస్కరణలు చూస్తే.. నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంది. బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ఏకంగా లక్షా 32 వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు. అలానే 31లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఏకంగా 17 వేల జగనన్న కాలనీలను, అంటే ఊళ్ళకు ఊళ్ళే నిర్మిస్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేదలకు కట్టిన ఇళ్ళు ఎన్ని..? పేదవాడికి ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చాడా..? అంటే లేదు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో రూట్ లెవల్ నుంచి సమూలంగా మార్పులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. సచివాలయ వ్యవస్థ గానీ, కొత్త జిల్లాల ఏర్పాటుగానీ.. ఇవన్నీ వైయస్ జగన్ తన పరిపాలనలో తెచ్చిన విప్లవాలు. పేదవాడి గడప వద్దకే పరిపాలన తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి జగనన్న. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అంటే ఉలుకూ పలుకూ ఉండదు. 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ జ్ఞానిని అని చెప్పుకునే చంద్రబాబు.. చేతల్లో ఏం చేశాడు అంటే చెప్పుకోవడానికి ఒక్క మంచీ లేదు. సమాజంలో చీలికలు, కులాల మధ్య విభజన తెచ్చి, తద్వారా నాలుగు ఓట్లు సంపాదించాలన్న తాపత్రయమే తప్ప.. ప్రజలకు మంచి చేయాలని, అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధి చేయాలని ఏనాడూ ఆలోచించని వ్యక్తిగా, చరిత్ర హీనుడుగా చంద్రబాబు మిగిలిపోతారు.