వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌లో ఏపీకి ఆరు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు.. 

అధికారుల‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

స‌చివాల‌యం : ఒక జిల్లా ఒక ఉత్పత్తి (వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ – ఓడీఓపీ)లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు వ‌చ్చాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దాని చీరలు, అల్లూరి జిల్లా అరకు కాఫీకి బంగారు పతకాలు, పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్‌ చీరలకు కాంస్య పతకాలు, మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ద‌క్కాయి. సామాజిక, ఆర్ధిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం – వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌

ఇటీవ‌ల న్యూఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర అధికారులు అవార్డులు అందుకున్నారు. కాగా, ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను కలిసి అవార్డుల వివరాలను పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత, జౌళి) శాఖ మంత్రి, ఉన్నతాధికారులు తెలియ‌జేశారు. అవార్డుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా  అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసినవారిలో పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, వాణిజ్య (చేనేత, జౌళి) శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, ఆ శాఖ డైరెక్టర్‌ ఎం.ఎం.నాయక్, అధికారులు పెద్దిరాజు, సురేష్‌ కుమార్, ధర్మారావు, హరిక్రిష్ణ, శ్రీనివాసరెడ్డి, వనజ ఉన్నారు.

Back to Top