ఎల్లో మీడియాను బహిష్కరించండి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుసజ్జల రామకృష్ణారెడ్డి 

 మీడియా పేరుతో చేస్తోన్న టెర్రరిజం, దౌర్జన్యం, దాష్టీకాలను ప్రజలు ఇక భరించొద్దు, బహిష్కరించండి 

 "ఉంటే బాబు ఉండాలి, లేకుంటే రాష్టం నాశనం కావాలి" అన్నదే రామోజీ సిద్ధాంతం 

  ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న ఈనాడు, అందులో అంతర్భాగమై తప్పుడు రాతలు రాస్తుంది 

 పైశాచికత్వానికి, దాష్టీకానికి, అసంబద్ధ వాదనలకు పరాకాష్టే ఓటీఎస్ పై ఈనాడు తప్పుడు రాతలు 

  చేతనైతే  మీడియా ప్రజలకు అవగాహన పెంచాలి..   అడ్డంగా ముంచేసిన బాబుకు వకాల్తానా..? 

 ఇప్పుడు ఉచితంగా  ఇళ్ళు ఇవ్వాలంటున్న ఈనాడు... బాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు, ఒక్క ముక్క అయినా రాశారా..? 

 టీడీపీకి ఎంత వయసు వచ్చిందో.. మీడియా ఉగ్రవాదంలో ఈనాడుకూ  అంతే వయసు 

  నా అక్షరం- నా ఆయుధం అంటూ జనం మీద రాధాకృష్ణ స్వైర విహారం 

  రాధాకృష్ణ ఎవరి ఏజెంటు, ఆయన తెర వెనుక రాజకీయాలు చూసి టీడీపీ నేతలే అసహ్యించుకునే పరిస్థితి. 

 అవి ప్రసార సాధనాలు కాదు.. విష ప్రచార సాధనాలు, వాటిని బహిష్కరించండి 

 ఐఎంజీ భారత స్కాంలోనే బాబు జైలుకి వెళ్ళాల్సిన వ్యక్తి 
 
పవన్ కల్యాణ్ ది ఆ గట్టో.. ఈ గట్టో తెలియదు 

  ఉద్యోగుల పట్ల  బాధ్యత కంటే.. నష్టం కలిగించే విధంగానే ఉద్యోగ సంఘాల చర్యలు 

తాడేప‌ల్లి:  అవి ప్రసార సాధనాలు కాదు.. విష ప్రచార సాధనాలు, ఎల్లో మీడియాను బ‌హిష్క‌రించాల‌ని విజ్ఞులైన ప్ర‌జ‌ల‌కు  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞ‌ప్తి చేవారు. పేదలంటే బాబు, రామోజీ, రాధాకృష్ణలకు ఏహ్య భావం... ఆ ముగ్గుర్నీ చెత్తబుట్టలో పడేయాలన్నారు. ఈనాడు ప‌త్రిక రాసిన కథ‌నాల‌ను స‌జ్జ‌ల ఖండించారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

 ఈనాడు దినపత్రికలో ‘ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడెందుకు వసూళ్లు’ అంటూ బ్యానర్‌ వార్త రాశారు. అసలు వాస్తవం అనేది లేకుండా, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఆ పార్టీలో అంతర్బాగంగా ఉంటూ... మరోపక్క ప్రజల పక్షాన మేమున్నామని అబద్ధాలు ఆడూతూ... ఏదైతే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, అందుకోసం ఎంతకైనా తెగించాలని... అన్నట్టుగా ఈరోజు ఈనాడు వార్త ఉంది. వీళ్ళు ఎవర్ని అనుకుంటే, వారిని అధికారంలో కూర్చోబెట్టాలనుకోవడం, లేదా వాళ్లు దిగిపోతే ... ఉన్న వాళ్ళను దించేసి, మళ్లీ వాళ్లను ఎలా అధికారంలోకి తీసుకురావాలా అనే ఎజెండాలతో వ్యవహరిస్తున్నారు.  ఇంకోపక్క ప్రజల కోసమే మేమున్నాం..  అంటూ, మీడియా పేరుతో,  వారిని దశాబ్దాలుగా మీస్‌లీడ్‌ చేస్తున్నవారిని మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా.. వాళ్లు అదే పంథా కొనసాగిస్తున్నారు.

  మీడియా పేరుతో వీళ్లు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టీకం, టెర్రరిజం.. వీటన్నింటిని ఇక భరించకండి. మన మెదళ్లను పాడు చేసే ఇలాంటి వార్తలను బహిష్కరించాలని విజ్ఞులైన ప్రజలకు విజ్ఞప్తి చేద్దామని మీడియా ముందుకు రావడం జరిగింది. ఎందుకు ఇంతగా అనాల్సి వస్తుందంటే..  దేనికైనా ఒక ఆధారం ఉంటే దానిమీద  ఒక దృక్కోణంలో చూసి కామెంట్‌ చేయడం సహజంగా జరుగుతుంది. అలా జరిగితే మంచి, చెడు తెలుస్తుంది. నాలుగు రకాల ధోరణులు తెలుస్తాయి. అవేమీ లేకుండా అసంబద్ధమైనవి, అబద్ధాలతో కూడినవి, వితండవాదంతో కూడిన వార్తలు వస్తున్నాయి. వీటి పైశాచికత్వానికి, దాష్టీకానికి దీనిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది.
 
ఈనాడు కథనం సారాంశం ఏంటంటే... "ఇన్నిలక్షల ఇళ్లు మేము కట్టిస్తామని చెప్పుకుంటున్నారు. ఇన్నివేల కోట్లు పెట్టి భూములు కొంటున్నామని చెబుతున్నారు. అలాంటివి ఉచితంగా ఇస్తామంటున్నారు. గతంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు.  మరి మేము ఏం పాపం చేశామని పేదలు అడుగుతున్నారని" కథనాలు రాశారు.
 
 ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛంద పథకం. బలవంతం ఏమీలేదు. పేదలకు మంచి చేసే దీనిపై మీడియా అవగాహన కల్పించాలేగానీ, అయోమయ స్థితిలోకి తీసుకువెళ్లకూడదు. చంద్రబాబు వ్యాఖ్యలను తీసుకుని ఇదెందుకు ఫ్రీగా ఇవ్వరని ప్రశ్నలు సంధించడం చూస్తుంటే.. వీళ్ళు మీడియా పేరుతో ఏం చేయాలనుకుంటున్నారో, వీళ్ళ ఎజెండా ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.  

 అప్పుభారం, రుణభారం అలాగే మోస్తూ ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నవారికి ఒక్కసారిగా సొంత ఆస్తి క్రియేట్‌ చేసి.. ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్న పథకం ఓటీఎస్. ఇంత పెద్దఎత్తున పథకం చేస్తున్నప్పుడు పేదల్లో అవగాహన పెంచి, వాటి ప్రయోజనాలను వివరిస్తే బాగుంటుంది. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. కనపడని దొంగదెబ్బలు లేవు. కానీ, ‘ఇప్పుడు ఎందుకు వసూళ్లు’ అని రాయడం చూస్తుంటే.. ఈనాడు పత్రిక బాధేంటి? ఉచితంగా ఇవ్వాలనా? మీరు మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎందుకు అడగలేదు, ఆ విధంగా ఒక్క ముక్క అయినా రాశారా..?

 గతంలో 50లక్షల మంది వరకూ ఇళ్ళ పథకం కింద ఇళ్లు తీసుకున్న పేదల్ని రుణ విముక్తుల్ని చేసి... ఈ ప్రభుత్వం వారికి సొంత ఆస్తిని కల్పించడమే లక్ష్యం. దొంగదెబ్బ తీయాలనుకుంటే రిజిస్ట్రేషన్‌కు చార్జీలు తీసుకోవచ్చు. అదే ఉచిత రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల ప్రభుత్వానికి కనీసం రూ.6వేల కోట్లు రావాల్సింది ఆగిపోతుంది. లబ్ధిదారుల మీద  పెద్ద మొత్తం భారం పడకుండా ప్రభుత్వం సేవ్‌ చేస్తోంది. నామమాత్రంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో... రూ.10వేలు, రూ.15 వేలు, రూ.20వేలు వసూలు చేసి, ఓటీఎస్ ద్వారా ఈ పథకాన్ని వినియోగించు కోవాలని చెప్పడం మానేసి దానికి కూడా తాటాకులు కడుతున్నారు. లేకుంటే,  చర్యలు తీసుకుంటామని మెమోలు ఇచ్చామంటున్నారు.
- శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఘటన చూస్తే.. ఒక గ్రామ కార్యదర్శికి అలా ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదు. ఓటీఎస్‌ మీద అవగాహన కల్పించేందుకు.. ఆ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులు చెప్పారు. టార్గెట్‌లు, పేదల మీద ఒత్తిడి పెట్టలేదు. అవగాహన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఉద్యోగులు చెబితే.. దాన్ని కూడా తప్పుపట్టడమేనా? 

 చంద్రబాబు నాయుడు హయాంలో పేదలను ఆదుకోవాలని కాని, వాళ్లకు ఇళ్లు కట్టించాలనే ఆలోచన కూడా చేయలేకపోయారు. అలాంటిది ఓటీఎస్‌పై ఏడుస్తున్నారు. ఇక టిడ్కో ఇళ్లు సుందరమైన అత్యాధునిక హంగులతో గేటెడ్‌ కమ్యూనిటీలుగా తీర్చిదిద్దారంటూ ఈనాడు బాబుకు బాకాలు ఊదుతోంది. మొండిగోడలు కట్టి,  షేర్‌వాల్‌ టెక్నాలజీ పేరుతో ప్రపంచంలోనే ఆధునికం అని చెప్పుకున్నారు. అదంతా పెద్ద స్కామ్‌ అని అందరికీ తెలుసు. అయితే అక్కడ ఏం సదుపాయాలు ఉన్నాయో వాళ్లే చెప్పాలి. టీడ్కో ఇళ్లు తీసుకున్నవాళ్లంతా ఇప్పుడు కుయ్యె, మొర్రో అంటున్నారు. 40ఏళ్లు దాటినవాళ్లు గ్రౌండ్‌ ప్లస్‌ త్రీ ఎలా ఎక్కుతారో, ఎలా దిగుతారో ఆలోచించలేదు. లిఫ్ట్ పెట్టి నడుపుకోగలరా? ఏం సౌకర్యాలు కల్పించాలో చెప్పాలి. చంద్రబాబు హయాంలో అధ్వాన్నంగా కట్టిన టిడ్కో ఇళ్ళను ఫోటోలతో సహా ప్రదర్శించారు.  

  ఏ ప్రభుత్వం అయినా ఒక పాలసీ తీసుకుంటే..  బాధ్యతగల ప్రభుత్వంగా ఎంతవరకు వెసులుబాటు కల్పిస్తే బెనిఫిట్‌ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తుంది. ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు నామినల్‌ ఫీజు పెడదామనే రూ.10వేలు పెట్టడం జరిగింది. లక్షల విలువ చేసే ఆస్తులను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తుంటే అవగాహన కల్పించడం మానేసి కన్‌ఫ్యూజన్‌ చేయడం ఏంటి? మేము బలవంతం చేయడం లేదని చెప్పాల్సి వస్తోంది. వచ్చిన అవకాశం పోగొట్టి మళ్లీ వారిని పేదలుగా ఉంచే దురుద్దేశంతోనే ఓటీఎస్‌ కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 
- వైయస్సార్‌ గారు అన్నట్లు అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. అలాగే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఇవ్వని హామీ ఉండదు. అధికారంలోకి వస్తే ఉన్నవాటి సారం అంతా తీసేసి పిప్పి చేసి...పేదలకు ఏమీ దక్కకుండా చేయని పనంటూ లేదు. గతంలోనూ చంద్రబాబు వైఖరి అంతే. పేరుకు విపరీతమైన పథకాలు పెట్టి అందర్ని ముంచేశారు. రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేశారు. అధికారంలోకి వస్తే.. అంతా ఉచితమని చంద్రబాబు హామీ ఇస్తారు. రైతు రుణ మాఫీని లక్ష కోట్లు కాస్తా... 14వేల కోట్లతో ముగించారు. మిగిలిన రూ.20వేల కోట్లను మీరు చేయండంటూ జగన్‌గారు అధికారంలోకి రాగానే బాబు మాకు పురమాయిస్తాడు. ఇదేం రాజకీయం..?

  2014-19లో అధికారంలో ఉన్నప్పుడు పేదల గురించి ఏమీ ఆలోచించలేదు. ఇక ఆయన కొడుకు నారా లోకేష్‌ మంగళగిరిలో తిరుగుతూ... మేము అధికారంలోకి వచ్చాక చేస్తాం. మీరు డబ్బులు కట్టొద్దు అంటూ చెబుతున్నాడు. అసలు వీళ్ళంతా పేదలను ఏం చేయాలనుకుంటున్నారు. రామెజీరావు, రాధాకృష్ణ వీళ్లు ఇద్దరూ ఏం చేయాలనుకుంటున్నారు...? పేదలంటే బాబు, రామోజీ, రాధాకృష్ణలకు ఏహ్య భావం. 
- పార్టీల తరపున పత్రికలు ఉండటం చూశాం. సాక్షి చెప్పినా చెప్పకపోయినా పత్రికపైన వైయస్సార్‌ గారి బొమ్మ ఉంది. మమ్మల్ని బండబూతులు తిడుతున్నా వాటిని కూడా వేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలియాలని. ఆధారం లేకుండా ఎక్కడా విషం కక్కే వార్తలు మాత్రం వేయడం లేదు. కానీ ఏ బాధ్యత లేకుండా కేవలం మీడియా ముసుగులో దశాబ్ధాల తరబడి... టీడీపీతో మొదలుపెట్టిన రౌడీయిజం.. తాము అనుకున్నది ప్రజల మీద రుద్దే దాష్టీకం, రుబాబు... దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాగుతోంది. టీడీపీకి ఎంత వయసు వచ్చిందో దౌర్జన్యాలకు.. ఈ మీడియా ఉగ్రవాద చర్యలకు అంత వయసు వచ్చింది.  ఈనాడు రామోజీ గారికి వార్థక్యం వచ్చింది. పొద్దున లేస్తే ఏమనుకుంటే అది విషం కక్కుతూ రాయడమే పనిగా పెట్టుకున్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుందనేలా కథనాలు రాస్తారు.

 రామోజీరావు కుట్రలను తీసుకుంటే ... ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడం.. ఆయనకు ఉన్న ఆదరణతో, అప్పటి కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలతో అధికారంలోకి వచ్చాక...  పవర్‌ రుచి మరిగాక, అదే ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించడానికి పెద్ద కుట్ర, మద్యనిషేధం అంటూ మరో కుట్ర, నిషేధం ఎత్తేయడానికి మరో కుట్ర. ఒకటా.. రెండా.. వాళ్ళకు కావాల్సినట్టు ఈనాడు క్యాంపెయిన్లు రాష్ట్ర  ప్రజలందరికీ తెలుసు. 
- అలాంటి పరిస్థితుల్లో తొలిసారి సాక్షి వచ్చింది. అందుకే అంత ఆదరణతో మొదలుపెట్టింది. ఇక ఆంధ్రజ్యోతి మూతపడిన తర్వాత మళ్లీ ఎలా ప్రారంభమైంది. దానికి ఫండింగ్‌ ఎలా వచ్చింది అనే దాన్ని తవ్వి తీస్తే అదో పెద్ద స్కామ్‌. విమర్శలు చేయడం తప్పు కాదు. జగన్‌గారు ప్రవేశపెట్టిన పథకాలపై విమర్శలు చేయండి. అప్పట్లో చంద్రబాబు చేశాడు...మీరెందుకు చేయరని నిలదీయండి. అంతేకానీ ఏ ఆధారం లేకుండా నిరాధార వార్తలు రాయడం సిగ్గుచేటు.

 చంద్రబాబు నాయుడు, టీడీపీకి, రామోజీరావు, రాధాకృష్ణకు... పేదలంటే ఏమైనా ఏహ్యభావం ఉంది అనే అనుమానం వస్తోంది. పేదలు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలనే భావనలో వీళ్ళు ఉన్నారు. పేదలు సొంతకాళ్లపై నిలబడకూడదు. వాళ్లు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదవకూడదు. వాళ్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందకూడదు అన్నదే వీరి అభిప్రాయం. చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎంత పెట్టారో తెలుసు. ఆయన హయాంలోనే చంద్రబాబు చదువుకున్న స్కూల్‌ ఏ దుస్థితిలోఉందో తెలుసు. ఆరోగ్యశ్రీ పథకంలో కూడా ఉన్నవాటిని కుదించి, ఉన్నసారం అంతా పీల్చి... ఆ పథకాన్ని డొల్ల చేశారు. పేదలకు సంబంధించి టిడ్కో ఇళ్ల పేరుతో జీ ప్లస్‌ త్రీ అంటూ మోసం చేశారు.

 ఈరోజు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు నిర్మించే గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. వేల కోట్లు ఖర్చు చేసి, 25వేల ఎకరాల భూమిని తీసుకుని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం మరో రూ. 34వేల కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు, డ్రైనేజ్‌, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మంచి అనేందుకు కూడా వారికి మనసు రాదు.
- ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ .. ఆయన ఎవరి ఏజెంట్‌, ఎవరిలో పార్ట్‌ అనేది అందరికీ తెలుసు. రాధాకృష్ణను చూసి టీడీపీ నేతలే అసహ్యించుకుంటారు. వాళ‍్లకంటే ఆయనకే ఆ  పార్టీలో ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి. రాధాకృష్ణ టీడీపీలో నాయకుడిగా ఉన్నా బాగుండేది. కానీ అన్నీ తెర వెనుక రాజకీయాలే. నా అక్షరం... నా ఆయుధం అంటూ జనం మీద పడి స్వైర విహారం చేస్తున్నాడు.

 ఇక రామోజీరావు... ఉషోదయా అంటూ ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. చేసే పనులు మాత్రం పూర్తిగా ప్రజా వ్యతిరేకం. "ఉంటే చంద్రబాబు అధికారంలో ఉండాలి లేకుంటే రాష్ట్రం నాశనం కావాలనేది" రామోజీరావు ఉద్దేశం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయడంతో... జనం చెత్తబుట్టలో పడేశారు. ఇక ఇప్పుడు ఈ ముగ్గుర్ని ప్రజలు చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను. వీరు రాసిన రాతల్ని చదవితే బుర్రలను పాడు చేసుకోవడమే. ఆరోగ్యాలు పాడు చేసుకోవటమే. ఈ మీడియా అనబడే ప్రసార సాధనాలను, విష ప్రచార సాధనాలను బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

 వ్యవస్థలను మేనేజ్‌ చేయగల దిట్టలు వాళ్లు. ఐఎంజీ- భారత కేసులోనే చంద్రబాబు జైలుకు వెళ్ళాల్సిన వ్యక్తి.  చంద్రబాబు అడ్డంగా దొరికినా... వైయస్సార్‌ గారు కూడా పొలిటికల్‌గా తేల్చుకుందామని అనుకున్నారు కాబట్టే చంద్రబాబు రోడ్ల మీద తిరగగలిగారు.

 ఏదైనా ఒక సమస్య మీద సంక్లిష్టత ఉంటే నలుగురూ కూర్చుని మాట్లాడుకోవాలి. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. అయితే రాష్ట్రానికి సంబంధించినంతవరకూ దానితో ఉన్న అనుబంధం, దానిపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉండటంతో పాటు భూములు విషయంలోనూ ... రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పోరాడుతుంది.
- పవన్‌ కల్యాణ్‌ కు సంబంధించి చూస్తే ఆయనది ఆ గట్టో, ఈ గట్టో తెలియదు. లోపల టీడీపీతో బంధం ఉన్నా.. బీజేపీతో ఉన్నారనేది అందరూ అనుకుంటున్నారు. పవన్‌ చేయగలిగింది ఒకటి ఉంది. చేతకాకపోతే మేము చేస్తాం అంటారు కదా. బీజేపీకి మిత్రపక్షం అయిన పవన్‌ కేంద్రం వద్దకు వెళ్లి ప్రభుత్వం అడిగినవాటిని చేయాలని, ఏపీకి చాలా అవసరమని ... వారికి నచ్చచెప్పి సాధిస్తే బాగుంటుంది. రాష్ట్రం మొత్తం హర్షిస్తుంది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పని చేసినట్లు ఉంటుంది. అంతేకానీ అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి చర్చించే అంత సంక్లిష్టత ఇందులో ఏమీలేదు. చాలా సింపుల్‌ విషయం. వైయస్సార్‌ సీపీ అధికారంలో లేని సమయంలో ఇదే అంశం వస్తే... జగన్‌గారు ప్రతిపక్ష నేతగా ప్రధానిగారిని కలిసి రిప్రజెంటేషన్‌ ఇచ్చేవారు. అఖిలపక్షాన్ని పిలవకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని రాజకీయంగా బండ వేసి తప్పించుకోవడం తప్ప మరొకటి కాదు.

 ఉద్యోగుల విషయానికి వస్తే.. పీఆర్సీ, సీపీఎస్‌, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌కు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుంది. సీపీఎస్‌ మీద కమిటీలు వేసి, స్టడీ చేస్తున్నారు. కొవిడ్‌ రాకుండా ఉంటే ముందే జరిగి ఉండేది. ఆ ప్రయత్నం ఇప్పుడూ జరుగుతుంది. మరో నెలరోజుల్లో పూర్తవుతుంది. ఉద్యోగులు ఎంతవరకైనా పోరాడతాం అని చెబుతున్నారు. ఏరూపంలో పోరాటాలు చేస్తారో నాకు అర్థం కావడం లేదు కానీ.. బాధ్యత కలిగిన సంఘాలు, యూనియన్లు అలా మాట్లాడతాయని అనుకోను. మొన్నకూడా పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. దిసీజ్‌ రాంగ్‌. ఉద్యోగుల పట్ల బాధ్యత కంటే.. నష్టం కలిగించే చర్యగానే నేను భావిస్తున్నాను. చంద్రబాబు లా పొద్దుపోని హామీలు ఇచ్చిన ప్రభుత్వం కాదు మాది. ఇచ్చిన హామీలు అన్నీ కంప్లీట్‌గా పూర్తి చేస్తున్న ప్రభుత్వం. రకరకాల కారణాలతో ఆలస్యం జరుగుతోంది. ముఖ్యమంత్రిగారో, నాయకులో కూర్చుంటే రెండ్రోజుల్లోనే అయిపోతుంది. అలాంటి చోట కొంచెం సంయమనం పాటిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. హెచ్చరికలు చేసినందువల్ల.. వాళ్లకే నష్టం. 

  ప్రతిపక్షం అనేది ఒక వ్యవస్థను ఆధారం చేసుకుని, అక్కడ నుంచి నడపాలని చూడటం ఎప్పుడూ జరగదు. ప్రజలు పదేపదే తిరస్కరించినా బుద్ధి తెచ్చుకోకుండా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తోంది. దాని ద్వారా ప్రభుత్వాన్ని విసిగిద్దాం. దాంతో పాటు ఆ రెండు పత్రికలలో ఎడాపెడా వార్తలు రాసేయడం. ప్రతిదానిలో ఏదో ప్రశ్న వస్తోంది. కొత్త చట్టాలు వస్తున్నప్పుడు, సంస్కరణల వల్ల కన్‌ఫ్యూజన్‌ అనేది రావచ్చు. దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నవాటిని ఒక స్పిరిట్‌ గా చూడాలి. మేం మిగిలినవారి కన్నా భిన్నంగా ఉన్నాం. ఆ భిన్నత్వం కూడా ఒక దూరదృష్టితో ఉండటంతో గతంలో కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో చేతకాక.. వేరే వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం కరెక్టు కాదు.  మహిళా పోలీసుల విషయానికి వస్తే.. దార్శనికతతో మేము చేస్తున్న పాలసీలకు ఇంకా చట్టబద్దత కల్పించే అవకాశం కలుగుతుంది. అదే ఆలోచనలో ఉన్నామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Back to Top