తాడేపల్లి: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈనెల 7వ తేదీన పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ తీర్మానం చేసిందని తెలిపారు. గతంలో ఇదే అంశంపై ట్విట్లు పెట్టిన ఆ పార్టీ ముఖ్య నేతలు .. ఇప్పుడు కార్యాచరణకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. వాళ్ల ఆందోళన జూమ్‌లో కాన్ఫరెన్స్‌లు, ఇళ్లలో దీక్షలు, కొవిడ్ నిబంధనలు పాటిస్తామని ఎక్కడికక్కడ నాలుగు ఫొటోలు తీసుకుని వారి అనుకూల పత్రికల్లో వేసుకోసి తృప్తిపడటమేనని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచితే ఎందుకని నిలదీయరని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..‘‘ పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే నైతిక హక్కు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు లేదు. ఊహించని సంక్షోభంలో ఉన్నప్పటికీ నిబ్భరంగా ఎవరి మీద భారం వేయకుండా.. జాగ్రత్తగా నెట్టుకొస్తున్న వైయస్ జగన్ మీద లేదా ఆయన పాలన మీద మాట్లాడానికి మీ స్థాయి తగదు. రాజకీయంగా విమర్శలు చేయడం ప్రతిపక్షం హక్కు అనుకోవడంలో తప్పు లేదు కానీ మీరు చేసిన నిర్వాకం మర్చిపోయారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతూ జీవో తెచ్చి, వ్యాట్‌కు అదనం లీటర్‌కు రూ.4 పెంచింది. 2014 జూన్‌లో రూ.73 ఉన్న లీటర్ పెట్రోల్ ధర 2018 సెప్టెంబరుకు రూ.86కు చేరింది. డీజిల్ రూ.62 నుంచి రూ.80కి పెరిగింది. 2019 ఏప్రిల్ నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.87.24 పైసల్‌కు చేరింది. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను సాకుగా చూపుతూ.. ఆర్టీసీ చార్జీలను 2015 అక్టోబరులో ఒకసారి, మళ్లీ డిసెంబర్లో, 2016 జూన్‌లో, 2017 జూలైలో మరోసారి పెంచారు. అదే వైయస్ జగన్ పాలనలో రెవెన్యూ రూ.30 వేల కోట్లకు తగ్గింది. కోవిడ్ కష్ట సమయంలో రాష్ట్ర ప్రజలకు ఆదుకునేందుకు దాదాపు రూ.25 నుంచి 30 వేల కోట్లు ఖర్చు చేసింది. అయినా ఎక్కడా ప్రజల మీద భారం వేయలేదు.
చంద్రబాబు హయాంలో రోడ్ల గురించి పట్టించుకోలేదు. మరమ్మతులు కూడా చేయలేదు. దీంతో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలు బాగా కురుస్తున్నాయి. వర్షాల వల్ల రోడ్లు కొంతమేర డ్యామేజ్ అయ్యాయి. వాటి అభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి ఒక రూపాయి వేసి ఆ మొత్తం నేరుగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. నిజంగా కొవిడ్ వంటి విపత్కర పరిస్థితులు లేకుంటే ఆ రూ.1 కూడా వేసే అవసరం వచ్చేది కాదు. కేవలం రోడ్ల అభివృద్ధి కోసమే ప్రజలపై రూ.1 భారం మోపారు.. మిగిలినవి కేంద్రం పెంచినవే.
అంతేకానీ మీకు లాగా కారణం లేకుండా అడ్డగోలుగా రూ.4, రూ.5 బాదుకొని .. దీన్ని సాకుగా చూసి ఆర్టీసీ చార్జీలు పెంచడం వంటి పనులను జగన్మోహరెడ్డిగారు చేయలేదే. మరి దేనిమీద ఆందోళన చేస్తారు. సిగ్గు ఎగ్గూ లేకుండా మనం మాట్లాడితే కేవలం రెండు పత్రికలు మనవి ఉన్నాయి కదా.. మనం ఆందోళన చేస్తే.. వాళ్లు ప్రచురిస్తే అయిపోతుందని అనుకుంటే ఎలా చంద్రబాబు గారు. ఆ రోజు మీరు పెంచిన రూ.4 ఈనాడు, ఆంధ్రజ్యోతికి కనిపించలేదా? లేదా మీరు చేసిన చర్య మేలి సంక్షేమ చర్యగా కనిపించలేదేమో?
టీడీపీ చేసిన అన్యాయం వల్ల, కొవిడ్, దాని తదనంతరం పరిస్థితుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది.
దురుద్దేశంతో ప్రభుత్వంపై ఆరోపణలు
అమరరాజ కంపెనీ విషపూరితమైన కాలుష్యం వెదజల్లుతోంది. దీని మీద హైకోర్టు కూడా కంపెనీని హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ఎక్కువ కాదు. 55 మందిని పరిశీలిస్తే 41 మందిలో సీసం ప్రభావం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అక్కడ విషం ఉందని తేలిన తరువాత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, న్యాయస్థానం కూడా ధ్రువీకరించిన తరువాత కూడా రాజకీయపరమైన, ప్రభుత్వంపై దురుద్దేశపూరితమైన ఆరోపణలు చేసే సాహసం ఈ రెండు మీడియాలు చేస్తున్నాయంటే వారి పైత్యం ఎంత మేరకు ప్రకోపించిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాను. చట్టపరమైన అనుమతులతో, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగని రీతిలో చర్యలు తీసుకుని కంపెనీని నడుపుకోమని చెప్పినా అమరరాజా వ్యవహారంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.