తాడేపల్లి: ప‌్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీకే ఎందుకు లేఖలు రాస్తున్నారని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోకుండా బాబు లేఖలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ..డీజీపీకి, సీఎస్‌లకు లేఖ రాస్తున్నారని తప్పుపట్టారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, ఓ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు కూడా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారం తప్ప మరోక ఆలోచన ఉండదన్నారు. ఆయనకు స్వార్థం తప్ప..జనం కష్టాలు తెలీవని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాస్తున్న లేఖల్లో వాస్తవాలు లేవన్నారు. చంద్రబాబు లేఖలు రాసే ముందు లెక్కలు సరిచూసుకోవడం లేదన్నారు. రెండు రోజులు ఆగి వాస్తవాలతో లేఖలు రాస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. చిత్తూరులో 490, విశాఖలో 250, ఒకేసారి 1600 కేసులు నమోదు అవుతున్నాయంటే ఎవరికైనా అనుమానం రాదా అని నిలదీశారు. చంద్రబాబుకు అంత అనుభవం ఉండి కూడా ఎందుకు ఇలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఆయనంటే వయసు మీద పడింది కాబట్టి తెలియకపోవచ్చు..ఆయనకు సలహాలు ఇచ్చే వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.ఇది టీడీపీ పాలన కాదని, మా పాలనలో ఎన్ని కేసులు పెడితే..అన్ని కేసుల్లో నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.చంద్రబాబు నేరాల విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో ఏం జరిగినా దానికి వైయస్ఆర్‌సీపీతో ముడి పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం తప్ప మరో ఆలోచన లేదన్నారు. ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ఇప్పుడు మేల్కొన్నారని, కోవిడ్‌పై తమకు సమాచారం ఇవ్వాలని ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. చంద్రబాబు తీరు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఓ జోకర్ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, గత ఆరు నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు శాయశక్తులా కృషి చేస్తుందని, దేశంలోనే ఏపీలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయని ప్రపంచమంతా చెప్పుకుంటోందన్నారు. చంద్రబాబుకు ఇవేవి కనిపించవన్నారు. టీడీపీ పాలనలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ పై విశాఖలో కత్తితో దాడి జరిగితే..ఎలాంటి విచారణ చేయకుండానే నాటి డీజీపీ స్పందించారన్నారు. దాడి చేసింది వైయస్ఆర్‌సీపీ కార్యకర్త, అభిమాని అంటూ కట్టు కథలు చెప్పారన్నారు. మా ప్రభుత్వంలో ఇలాంటి ఆరోపణలు చేయడం లేదని, ఏ ఘటన అయినా సరే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.