ప్రజలు బుద్ధి చెప్పినా బాబులో మార్పురాలేదు

మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు

దళిత ఎంపీ సురేష్‌పై దాడి హేయమైన చర్య

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

 

తాడేపల్లి: మహిళలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, 2019 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బాబులో ఎలాంటి మార్పు రాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దళిత ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేయించడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ప్రజలు నాయకులపై ఆధారపడకూడదనే సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు.

హైదరాబాద్‌తో పోటీ పడే రాజధాని నిర్మించాలనే ఆలోచనలో సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారని, అందుకే అన్ని సదుపాయాలు ఉన్న విశాఖను పరిపాలన రాజధానిగా ఎంచుకున్నారని చెప్పారు. ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా.. అప్పుల భారం పెంచిపోయాడన్నారు. పేదలు అమరావతిలో ఒక గజం స్థలం కొనగలిగే అవకాశం ఉందా..? ప్రశ్నించారు. రాజధానిలో ఉద్యోగులు కూడా ఇల్లు కట్టుకునేందుకు ఇష్టపడలేదన్నారు. రాజధానికి ప్రభుత్వ స్థలం ఉండాలని అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అమరావతి ప్రాంత రైతులను సీఎం ఆదుకుంటారని, ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు సీఎంతో భేటీ కూడా అయ్యారని గుర్తుచేశారు. చంద్రబాబు తన రియలెస్టేట్‌ వ్యాపారం కోసమే ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని సజ్జల మండిపడ్డారు.

Back to Top