ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి:ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవచ్చన్నారు.  ప్రజల అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనన్నారు. 
 ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని అన్నారు. 100కు వందశాతం అమలయ్యేలా ఉండాలన్నారు. మ్యానిఫెస్టో తయారీకి ముందే రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం పరిశీలించాలని సూచించారు. తాము గతంలో చెప్పినవి 98శాతం పైగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని విమర్శించారు.

కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషించమని స‌జ్జ‌ల తెలిపారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామని, అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారన్నారు. మా విధానం మాకు ఉంది, మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నాం. అంతిమ నిర్ణేతలు ప్రజలే. రాష్ట్ర అభ్యున్నతే ముఖ్యం. పక్క రాష్ట్రాల గురించి మేము మాట్లాడటం లేదు. వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు. తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చింది. మేము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అందరూ బాగుండాలనేదే వైయ‌స్ఆర్‌ సీపీ సిద్ధాంతం. 

అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అభివృద్ధి వికేంద్రీకరణ విధానం ఎందుకు ఎత్తుకున్నామో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రాత్మక పరిణామం. చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేద‌ని  సజ్జల పేర్కొన్నారు.

Back to Top