ఉద్యోగులను సీఎం వైయ‌స్‌ జగన్‌ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి

 తాడేప‌ల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో స్నేహ పూర్వక సంబంధాలు నెరిపే ప్రభుత్వమిదనివైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను సీఎం వైయ‌స్‌ జగన్‌ కుటుంబ సభ్యులుగా పరిగణించి.. వారి సంక్షేమం కోసం పాటుపడతారని చెప్పారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. ఉద్యోగులకు చేయగలిగినంత మేలు చేశారన్నారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి చేసిన ప్రతిపాదనలకు సమ్మతి తెలిపి.. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతలు భిన్నంగా మాట్లాడటం సరి కాదన్నారు. ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేతలతో సీఎం వైయ‌స్‌ జగన్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆయన తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.  

ఉద్యోగుల హక్కులను గౌరవించాం
► గత నెల 7న పీఆర్సీ ప్రకటన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంలో వారి హక్కులను గౌరవించాం. వారి సమస్యలపై చర్చించేందుకు మంత్రుల కమిటీని సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారు.
► రెండు రోజులపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చించి.. సమస్యలు పరిష్కరించింది. పీఆర్సీ ప్రకటన వల్ల రూ.10,247 కోట్ల భారం పడింది. హెచ్‌ఆర్‌ఏ స్లాబులు పెంచడం, సీసీఏ కొనసాగించడం, అడిషనల్‌ పెన్షన్‌ క్వాంటమ్‌ ఇచ్చేందుకు అంగీకరించడం వల్ల అదనంగా మరో రూ.1,330 కోట్ల భారం పడుతుంది. 
► అయినా సీఎం వైఎస్‌ జగన్‌ బాధ్యతగా భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే.. ఉద్యోగులు ఆశించిన దాని కంటే అధికంగా ప్రయోజనం చేకూర్చేవారు. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సహకరించినంత మేరకు ఉద్యోగులకు చేయగలిగినంత చేశారు. బెస్ట్‌ ప్యాకేజీ ఇచ్చారు. 

అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడేంటిలా?
► మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించిన మేరకు హెచ్‌ఆర్‌ఏ స్లాబులు పెంచాం. ఏవైనా సమస్యలు ఉంటే అప్పుడు ఎత్తిచూపి ఉంటే.. వాటిని పరిష్కరించేవారం. మంత్రుల కమిటీ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదం తెలిపి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరికాదు.
► ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఉద్యోగులే. వారు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తాయి. అలాంటి ఉద్యోగులతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనూ సంతోషంగా ఉంచాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్దేశం.
► ఎవరూ అడగకుండానే పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సమర్థవంతంగా పని చేశారు. 
► రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు సహృదయంతో అర్థం చేసుకుని, సహకరించాలి. ఉద్యోగులపై ప్రభుత్వం ఎక్కడా ఆధిపత్య ధోరణితో వ్యవహరించలేదు.
► పవన్‌ కళ్యాణ్‌ విమర్శలకు అర్థం లేదు. ఆయన ఆరోపించినట్లుగా ఆధిపత్య ధోరణి ప్రదర్శించి ఉంటే.. ఛలో విజయవాడ కార్యక్రమంలో ఏ ఒక్క ఉద్యోగినైనా ప్రభుత్వం ఏమైనా అనిందా? పవన్‌ కళ్యాణ్, ఆయన గురువు చంద్రబాబు రాజకీయం కోసం లేని సమస్యలను సృష్టిస్తారు. చౌక బారు విమర్శలు చేస్తారు. 

తాజా వీడియోలు

Back to Top