మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలి

కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేతల డిమాండ్ 

గుంటూరు జిల్లా: మంగళగిరి నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కొమ్మినేని దుర్గాప్రసాద్ వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ, మార్కెట్‌లో మొక్కజొన్న, జొన్నకు సరైన ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్కెట్ ధర క్వింటాకు సుమారు ₹1700 ఉండగా, కనీస మద్దతు ధరతో పోలిస్తే రైతులు భారీగా నష్టపోతున్నారని చెప్పారు. ఒక్క క్వింటా మొక్కజొన్నపై సుమారు ₹700, జొన్నపై ₹2000 వరకు నష్టం వస్తోందని పేర్కొన్నారు.

గతంలో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచిందని, ప్రస్తుతం ఆ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. ఎరువుల ధరలు పెరగడం, కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారడం వల్ల ఒక్కో రైతు ఎకరానికి రూ.30 వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ, రైతు లేకపోతే సమాజం నిలబడదని, అలాంటి రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. అప్పులు చేసి పంట పండిస్తున్న రైతులు సరైన ధర లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే జిల్లా స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కొమ్మినేని దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు జరిగినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు మధ్యదళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. గతంలో రైతు భరోసా కేంద్రాల వద్దే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు జరిగేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే రైతుల తరఫున పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.
 

Back to Top