బాపట్ల: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హయాంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ఒక ఫిషింగ్ హార్బర్ గానీ, పోర్ట్ గానీ నిర్మించాడా? అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు ప్రశ్నించారు. మండలంలోని న్యూ అంబేడ్కర్ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ.. మత్య్సకారులు, ఆక్వా రంగంపై ఇద్దరికీ మాట్లాడే అర్హత లేదని తెలిపారు. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర చేయడం లేదని, విహార యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపేట్టే విధంగా ఆయన వాఖ్యలు చేస్తున్నాడని, ప్రజలెవ్వరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు అధికారంలోకి వచ్చే అదృష్టం లేదని తెలిపారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబునాయుడు అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పండగ చేసి చూపించారని గుర్తు చేశారు.దేశంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంతం అధికంగా ఉందని తెలిపారు. మత్స్యకారులు, మైరెన్ సెక్టార్‌కు అభివృద్ధికి సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక నిధులు కేటాయించారన్నారు. తొమ్మిది పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో నాలుగు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలో ఆక్వా రంగం నుంచి రూ. 40వేల కోట్ల ఆదాయం వస్తుండగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 30వేల కోట్లు వస్తున్నాయని వెల్లడించారు. దీన్నిబట్టి సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రంగాన్ని ఎంత అభివృద్ధి చేశారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఆక్వా రంగానికి సబ్సిడీపై రూ. 1.5కే విద్యుత్‌ను అందింస్తుంటే, కళ్లులేని కబోదిలా లోకేష్ తప్పుడు వాఖ్యలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వా ఉత్పత్తులు, ఫీడ్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మైరెన్ యూనివర్సిటీలు ముంబై, చైన్నెలోనే ఉండేవని ఇప్పుడు నర్సాపురం నియోజకవర్గంలో త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు మోపిదేవి పేర్కొన్నారు. మత్య్సకారుల అభ్యున్నతి కోసం ఆక్వా హబ్‌ను రేపల్లె నియోజకవర్గంలోని దిండిలో 272 ఎకరాల్లో రూ.400 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆక్వా రంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి దేశంలో అగ్రగామిగా ఉండేలా కృషి చేసిందని చెప్పారు. ఆక్వారంగ అభివృద్ధి జరగలేదని టీడీపీ, ఎల్లోమీడియాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య పాల్గొన్నారు.