ప్రొద్దుటూరు: ఇప్పుడు షర్మిలగారు చెప్పేవన్నీ అబద్ధాలు అని, ఆమె జగన్‌గారి రాజకీయ అంతానికి కుట్ర పన్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫైర్ అయ్యారు. పదవీ కాంక్షతో శతృవులతో చేయి కలిపిన ఆమె.. చంద్రబాబు, సునీతతో కలిసి పోయారని ఆక్షేపించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంపై షర్మిలమ్మ మాట్లాడ్డం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అని అభివర్ణించారు. చెల్లెలు అంటే జగన్‌గారికి ప్రేమ, అభిమానం అని, అందుకే స్వార్జిత ఆస్తిలోనూ వాటాలు ఇచ్చారన్న రాచమల్లు, నాడు వైయస్సార్‌గారు కూడా ఆస్తులు పంచి ఇచ్చారని గుర్తు చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే ఇప్పుడు జగన్‌గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించారు తప్ప, ఆయన ఆస్తుల కోసం కోర్టుకు ఎక్కలేదని స్పష్టం చేశారు. జగన్‌గారికి ఏం జరిగినా చూస్తూ ఊర్కోబోమన్న మాజీ ఎమ్మెల్యే, ఆయనతో పార్టీ నాయకులు, కార్యకర్తలది హృదయ బంధమని తేల్చి చెప్పారు. షర్మిలమ్మ అత్యాశ, అహంకారంతో తనకు హక్కు లేని ఆస్తుల కోసం తన అన్ననే బజారుకు ఈడ్చుతోందని, దాదాపు 30 ఏళ్ల క్రితం పెళ్లైన షర్మిలకు, వైయస్ఆర్ చనిపోయిన తర్వాత 14 ఏళ్లకు ఏరకంగా ఆస్తి వస్తుందని రాచమల్లు ప్రశ్నించారు. అయినప్పటికీ వైయస్ జగన్‌గారు చెల్లి మీద ప్రేమతో తన స్వార్జిత ఆస్తిలో వాటాలు రాసిచ్చారని, పదేళ్లలో ఏకంగా రూ.200 కోట్ల సాయం చేశారని తెలిపారు. స్వార్జిత ఆస్తిలో వాటా ఇస్తూ.. ఆస్తులు అటాచ్‌మెంట్‌లో ఉండడంతో, కేసు క్లియర్ అయిన తర్వాత, బదలాయించేలా ఎంఓయూ రాశారని గుర్తు చేశారు. అయినప్పటికీ షర్మిలగారు, షేర్లు బదలాయించుకోవడంతో చట్టపరంగా తనకు ఎదురయ్యే సమస్యను గుర్తించి, వైయస్ జగన్‌గారు దాన్ని రద్దు చేయాలంటూ ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు చేశారని చెప్పారు. షర్మిలమ్మ చర్య వెనక రాజకీయ ప్రయోజనాలు, పదవీకాంక్ష, అత్యాశ, అహంకారం ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే అన్నారు. తన భర్త కష్టార్జితంలో ఆడపడుచుకు వాటా ఇస్తున్నా, అభ్యంతరం చెప్పని భారతిగారిని ప్రశంసించాల్సింది పోయి, ఆమెపైనా విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఏనాడైనా తన కుటుంబం గురించి, తోబుట్టువుల గురించి చెప్పారా? మాట్లాడారా? అని ప్రస్తావించిన రాచమల్లు.. వైయస్ జగన్‌గారి మాదిరిగా చంద్రబాబు తన సోదరీమణులకు ఒక్కటంటే ఒక్క ఆస్తిలో వాటా ఇచ్చారా? అని నిలదీశారు. ఒకరి ఇంటి ఆస్తి తగవుతో చంద్రబాబుకు ఏం సంబంధమని మాజీ ఎమ్మెల్యే చురకలంటించారు.