‘రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్’ ఆల్బమ్ విడుద‌ల‌

వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా 6 పాట‌ల సీడీ విడుద‌ల‌
 

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రూపొందించిన రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్ అనే ఆల్బామ్‌ను శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు ముక్కా రుపానంద‌రెడ్డి, యువజ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముక్కా సాయి వికాశ్‌రెడ్డి నేతృత్వంలో ఆరు పాట‌ల‌తో రూపొందించిన ఆల్బమ్ సీడీని లోట‌స్‌పాండ్‌లోని వైయ‌స్ జ‌గ‌న్ స్వ‌గృహంలో జ‌న‌నేత చేతుల మీదుగా విడుద‌ల చేశారు. అనంత‌రం ముక్కా సాయి వికాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తార‌ని  విమ‌ర్శించారు.

వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచుతానని హామీ ఇచ్చేంతవరకు చంద్రబాబుకు పెన్షన్‌ పెంచాలనే ఆలోచనే రాలేదని ఎద్దేవా చేశారు.  ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే వైయ‌స్ఆర్‌సీపీ పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు.  

డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాటలను నమ్మి రుణాలు కట్టని మహిళలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో మహిళలను మరోసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగా.. మూడు విడతలుగా పదివేలు ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రైతులకు కూడా రుణ మాఫీ చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. మూడు నెలలు కూడా పనిచేయని సెల్‌ఫోన్లను ఇస్తూ వాటి కొనుగోలులో కూడా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు మోసం చేసిన తీరును రైతులు, డ్వాక్రా మహిళలు చర్చించుకుంటున్నారని వివరించారు.  నిత్యం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్న టీడీపీ  ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. అందరితో కలసిమెలసి 2019 ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. న‌వ‌ర‌త్నాల‌పై విస్తృత ప్ర‌చారం అవ‌స‌ర‌మ‌న్నారు. అందులో భాగంగానే త‌మ వంతు స‌హ‌కారంగా పాట‌ల‌ను రూపొందించామ‌ని చెప్పారు. ఈ పాట‌ల‌ను పార్టీ శ్రేణుల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని, న‌వ‌ర‌త్నాలను ప్ర‌తి ఇంటికి చేర్చాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు.

Back to Top