చంద్రబాబు బేరసారాలకు ఆర్‌ కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు
 

విశాఖపట్నం:   వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్‌ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు.  

 రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య బీసీలను మోసం చేస్తూ చంద్రబాబునాయుడికి అమ్ముడుపోయారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల గళం వినిపిస్తారని కృష్ణయ్యను వైయ‌స్ జగన్‌గారు రాజ్యసభకు పంపిస్తే.. ఆయన అదే బీసీలను మోసం చేశారని మండిపడ్డారు.
    ఎన్నో ఏళ్ల నుంచి బీసీల అండతో ఎదిగి.. ఈరోజు చంద్రబాబు కొనుగోలు బేరానికి లొంగిపోయిన వ్యక్తి అన్న అపప్రద అవసరమా? అని ఆర్‌.కృష్ణయ్యను మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇక కృష్ణయ్య బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగానూ, చరిత్ర హీనుడిగానూ మిగిలి పోతారని ఆక్షేపించారు.
    బీసీల తరపున పోరాటంలో ఏ రాజకీయ పార్టీల వేదికగా ఉండాలనుకోవడం లేదన్న కృష్ణయ్య మాటలు తప్పు బట్టిన కారుమూరి, మరి గతంలో వివిధ రాజకీయ పార్టీలకు ఎందుకు ప్రాతినిధ్యం వహించావని ప్రశ్నించారు. కృష్ణయ్య చేసిన పనిని రెండు తెలుగు రాష్రాల ప్రజలు ఎప్పటికీ క్షమించరని చెప్పారు. 
    14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఏనాడూ ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదన్న మాజీ మంత్రి, బీసీలను ఓట్లేసే యంత్రాలుగా వాడుకున్నాడే తప్ప, ఏనాడు వారికి పెద్దపీట వేయలేదని గుర్తు చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య వంటి బీసీలకు వైయ‌స్ జగన్ పదవులిస్తే, చంద్రబాబు వారిని కొనుగోలు చేసి పెత్తందార్లకు అమ్ముకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని కారుమూరి దుయ్యబట్టారు. అలా చంద్రబాబు బేరగాడిగా మారారని వ్యాఖ్యానించారు.
    టీటీడీ లడ్డూల తయారీపై సీఎం చంద్రబాబు ఆరోపణల తర్వాత, ఈఓ, సీఎం వేర్వేరు ప్రకటనల వెనుక స్పష్టమైన రాజకీయ కోణం కనిపిస్తోందని మాజీ మంత్రి చెప్పారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం.. డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ, కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని ఆక్షేపించారు.
    పవన్‌కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్షను ప్రస్తావించిన కారుమూరి నాగేశ్వరరావు, పసిపిల్లపై అత్యాచారం చేసి చంపినప్పుడు, నడిరోడ్డు మా పార్టీ కార్యకర్తను దారుణంగా నరికి చంపినప్పుడు, తమ (ప్రభుత్వం) నిర్లక్ష్యం వల్ల విజయవాడను వరద ముంచెత్తడంతో చనిపోయిన వారి కోసం, సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయనందుకు.. అలా ప్రజలను మోసం చేసినందుకు, పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే బాగుండేదని అన్నారు.

Back to Top