ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం

ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
 

తాడేప‌ల్లి: ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన, పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్ల వయసులోపు చిన్నారులు 52.27 లక్షల మంది ఉన్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింద‌ని తెలిపారు. వీళ్లందరికీ విధిగా పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేసింద‌ని,  ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల మందు బూత్‌లలో అందుబాటులో ఉంటుంద‌న్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశార‌ని తెలిపారు. ఒకవేళ ఆదివారం ఎవరైనా చిన్నారులకు వేయించలేని పరిస్థితి ఉంటే ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తార‌ని తెలిపారు.  కార్య‌క్ర‌మంలో వైద్య‌శాఖ మంత్రి ఆళ్ల నాని, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top