అసెంబ్లీ: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆక్వా రైతులకు రూ.1.50 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తున్నారని, మూడేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపేనా రూ.2,113 కోట్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్యుత్ సబ్సిడీ పేరుతో గత ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి అసెంబ్లీలో మంత్రి బాలినేని మాట్లాడారు.
గత ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.309 కోట్లు ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. జీవోల పేరుతో రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు తగ్గిస్తానని వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3.86 ఉన్న యూనిట్ చార్జీలను రూ.1.50కి తీసుకువచ్చారన్నారు.
కంపెనీలు సిండికేట్ అయ్యి ఫీడ్ ధరలు పెంచుతున్నారని, అదే విధంగా రొయ్యల ధరలు తగ్గిస్తున్నారని, సీఎం వైయస్ జగన్ ఇస్తున్న సబ్సిడీ వల్ల నిలదొక్కుకుంటున్నామని ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు చెప్పారని, ఈ విషయాలను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆక్వా రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.