పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా పొట్టిశ్రీ‌రాములు జ‌యంతి

అమ‌ర‌జీవికి నివాళుల‌ర్పించిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అమ‌ర‌జీవి పొట్టి శ్రీ రాములు జ‌యంతి వేడుక‌లు ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాల‌య ప‌ర్య‌వేక్ష‌కులు, ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కులం, ప్రాంతం, మతం అనే భేదాలు లేకుండా గౌరవించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. 

ఈ సందర్భంగా  శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...  శ్రీ పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధితో సాన్నిహిత్యం కలిగి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేయడంలో ఆయన కీలకపాత్ర వహించారని అన్నారు. దళితులకు ఆలయాలలో ప్రవేశం కోసం నిరాహారదీక్ష చేశారని వివరించారు. అదే విధంగా ఉప్పుసత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. తన పోరాటాల ద్వారా అనేక మందికి పొట్టిశ్రీరాములు గారు స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. ఆంధ్ర రాష్ర్టం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశారన్నారు. అయితే ఆయన మరణానంతరం ఆంధ్రరాష్ర్టం ఏర్పడిందని వివరించారు. గాంధేయమార్గంలో నడుస్తూ తాను అనుకున్నది సాధించారని కొనియాడారు. ఆయనను అందరూ మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కీర్తించారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులంతా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఆయన ఆశయం, త్యాగం వృథాకావన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని లేళ్ళ అప్పిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ మద్దాల గిరి, తిరుపతి స్మార్ట్ సిటి ఛైర్ పర్సన్ శ్రీమతి నారమల్లి పద్మజ, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ నారాయణమూర్తి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top