షర్మిల కేసులో దర్యాప్తు ముమ్మరం

పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అరెస్టు 

 హైదరాబాద్‌ : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబ్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసి దాదాపు 60 పోస్టులపై తీవ్ర అసభ్యకర కామెంట్లు చేసిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును గుంటూరులో అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 509, 67(ఎ) ఐటీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరికాసెట్లో నిందితుడిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నారు. అసలు సూత్రదారుల పాత్రపై విచారించేందుకు నిందితుడిని కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి. నిందితుడు గుంటూరులోని ఆర్‌వీఆర్‌ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. సొంతూరైన వేములలో తమ కుటుంబానికి రెండెకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని పోలీసుల విచారణలో  వెల్లడించినట్లు సమాచారం.

మంచిర్యాలలో..
వెంకటేశ్వరరావు మాదిరిగానే షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర కామెంట్లు చేసిన మరొకరిని మంచిర్యాలలో సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మరికాసెట్లో హైదరాబాద్‌కు తరలించనున్నారు. అలాగే షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసిన మరో ఐదుగురి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Back to Top