తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దళిత పక్షపాతి అని మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. దళితులపై ఏ ఘటన జరిగినా వేగంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రతిపక్ష నేత చంద్రబాబు రహస్య ఎజెండాను మాజీ ఎంపీ హర్షకుమార్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హర్షకుమార్ దళిత మాస్క్ వేసుకుని రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జోకర్‌నని హర్షకుమార్ అంటున్నారు. విద్యార్థిగా దళిత ఉద్యమాల్లో పోరాటాలు చేసి వచ్చిన వ్యక్తిని అంటూ గుర్తు చేశారు. చంద్రబాబు చేతిలో పావులాగా ఉపయోగపడుతున్న హర్షకుమారే జోకర్. దళితులకు గత ప్రభుత్వాలు ఏం చేశాయో.. వైయస్ జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు రా.. మాట్లాడదాం అంటూ విశ్వరూప్ సవాలు విసిరారు. దళితుల సమస్యలకు, అమరావతికి సంబంధం ఏంటి? దమ్ముంటే అమలాపురం వచ్చి సభ పెట్టు. అమరావతిలో దళితుల అసైన్డ్ భూములను చంద్రబాబు, ఆయన బినామీలు ఎలా లాక్కున్నారో తెలియదా? చంద్రబాబు ప్రయోగిస్తున్న కొత్త యాక్టర్‌వి నువ్వు. ప్రసాద్ అనే వ్యక్తి నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఇవ్వండని రాష్ట్రపతికి లేఖ రాయడం వెనుక నీ హస్తం ఉందని విశ్వరూప్ పేర్కొన్నారు.