విపత్తు వేళ..ఇళ్ల వద్దకే పింఛన్‌

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

గడప వద్దకే వెళ్లి పింఛన్‌ సొమ్ము అందిస్తున్న వాలంటీర్లు

ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక సాయం

తాడేపల్లి: విపత్తు వేళ..ప్రపంచమంతా కరోనా వైరస్‌ కారణంగా వణికిపోతుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం గ్రామ, వార్డు వాలంటీర్లు సూర్యుడి కంటే ముందుగానే ఇంటింటా పర్యటిస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం.. మరోవైపు కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం.. ఇలాంటి పరిస్థితిలోనూ సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు.. ఇతరత్రా సామాజిక పింఛన్లను మాత్రం ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. పింఛనుదారులలో సగానికి పైగా వృద్ధులు, వివిధ రకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఇబ్బంది కలగకుండా సూర్యోదయం తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు మంగళవారమే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న కారణంగా పింఛన్ల పంపిణీలో సమస్యలు, ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించడానికి ప్రతి జిల్లాలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో, రాష్ట్ర స్థాయిలో సెర్ప్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేశారు.  సకాలంలో పింఛన్‌ సొమ్ము అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటూ కొనియాడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుచూపుతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన వాలంటీర్‌ వ్యవస్థ విపత్తు సమయంలో ఆపద్భాందవుల్లా మారారు.

Back to Top