9.05 లక్షల మందికి మూడో విడత ‘జగనన్న తోడు’

‘సెర్ప్‌’ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

6,91,530 మందితో పాటు కొత్తగా మరో 1,57,760 మందికి బ్యాంకు రుణాలు

అమరావతి: ‘జగనన్న తోడు’ పథకంలో చిరు వ్యాపారులకు ప్రభుత్వం మూడో విడత కింద లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జగనన్న తోడు, వైయ‌స్సార్‌ చేయూత, ఆసరా, వైయ‌స్సార్‌ సున్నా వడ్డీ, స్వయం సహాయక సంఘాలు, వైయ‌స్సార్‌ పెన్షన్‌ కానుక తదితర పథకాల అమలుపై సోమవారం మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..జగనన్న తోడు మూడో విడత కార్యక్రమాన్ని ఈ నెల 22న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. బ్యాంకుల ద్వారా గత రెండు విడతలుగా రుణాలు పొందిన 6,91,530 మందితో పాటు కొత్తగా మరో 1,57,760 మందికి మూడో విడతలో బ్యాంకు రుణాలు అందించనున్నట్లు వివరించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మూడో విడత సున్నా వడ్డీ పథకం కోసం..
వైయ‌స్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మొదటి విడతలో దాదాపు 81 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.1,207.14 కోట్లు, రెండో విడతలో 97 లక్షల మంది మహిళలకు రూ.1,081.23 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మూడో విడత కింద పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పెన్షన్‌ లబ్ధిదారుల జాబితాలను ఆధార్‌ లింక్‌తో అనుసంధానం చేసి మరింత పారదర్శకంగా పింఛన్ల పంపిణీ చర్యలు చేపట్టాలని సూచించారు. పొదుపు సంఘాలకు సంబంధించి గ్రామ సమాఖ్యలో నిధుల దుర్వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని.. గ్రామ సమాఖ్యల కార్యక్రమాలపై పర్యవేక్షణ, పరిశీలన కోసం ఒక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top