సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల‌కు పరీక్షలు 

 తాడేపల్లి : సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ప్రారంభ‌మ‌వుతున్న‌ట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను సవాల్‌గా తీసుకోవాలని  జిల్లా కలెక్టర్లు, జేసీలను మంత్రి ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

వారం రోజుల పాటు ప‌రీక్ష‌లు..
 ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు.  మొత్తం 10,63,168 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ద్వారా రవాణా సదుపాయం ఉండేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల ఎంపికలో ఇబ్బందులు లేకుండా చూడాలని,రూట్ ఆఫీసర్లు, జోనల్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని అన్నారు. గతంలో విజయవంతంగా సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించామని, ఈసారి కూడా అదే తరహాలో పరీక్షలను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top