విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతుందని, రేపు అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి సాయంత్రం 7 గంటలకు చప్పట్లు కొట్టి గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటి ముందుకు ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది అని పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా 543 సేవలను ఈ రోజు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనను ఈ ప్రభుత్వం అందిస్తోంది. సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని అభినందించారని మంత్రి తెలిపారు. పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థ.. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ లో ఒక పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థని చేర్చారని పెద్దిరెడ్డి తెలిపారు. 61,65,000ల మందికి పెన్షన్లు గత నెల వరకు ఇస్తున్నాం. 34,907 మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా మా ప్రభుత్వంలో ఈ పెన్షన్‌ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1,26,200 మంది ఇప్పటి వరకు గ్రామ సచివాలయల్లో పనిచేస్తున్నారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జ్ ద్వారా దళితులలో లబ్ది పొందాలి అని చంద్రబాబు చూస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.