తాడేపల్లి: అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల కష్టార్జితాన్ని విచ్చలవిడిగా దోచుకుంటోందని వైయస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ. 2,540 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేశారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ. 18,500 వరకు ఖర్చు చేయడం ఏ రకమైన పాలన అని నిలదీసిన సజ్జల, ఇదంతా చంద్రబాబు తన అస్మదీయులకు సంపద సృష్టించేందుకు వేసిన 'నిరంతర దోపిడీ' ప్లాన్ అని ఆరోపించారు. వైయస్ జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' కాన్సెప్ట్‌కు ప్రజల్లో వస్తున్న సానుకూలతను తట్టుకోలేకనే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు మెడికల్ కాలేజీలకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, అక్రమ లేఅవుట్లకు అనుమతులిస్తూ పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేయడం గర్హనీయమన్నారు. అక్రమ కేసులతో జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని, వైయస్ఆర్‌సీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తున్న చంద్రబాబు, లోకేష్‌లు గుర్తు పెట్టుకోవాలని.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేసే శక్తి తమకుందని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. - అమరావతిలో 'అద్దాల' పేరుతో రూ. 2,540 కోట్ల భారీ దోపిడీ.. అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 నుంచి రూ.14వేలు అనుకుంటే... రాను రానూ ఇది ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అదే టైంలో చంద్రబాబు ఆలోచనలకు రూపమిచ్చే మంత్రి నారాయణ మాట్లాడుతూ రూ.14 కాదు రూ.16వేలు కూడా కావచ్చు అని మరింత బరింతతెగింపు ప్రకటన చేశారు.ఇవాళ కేవలం అద్దాలకోసమే చెబుతున్న రూ.2540 కోట్లకు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. అది కలిపితే కేవలం అద్దాల కోసం పెడుతున్న ఖర్చు రూ.3వేల కోట్లవుతుంది. రాజధానిలో నిర్మాణం చేపడుతున్న 52 లక్షల చదరపు అడుగులకి ఈ నిర్మాణ ఖర్చు కూడా కలుపుతుంటే... చదరపు అడుగునిర్మాణానికి రూ.18,500 వరకు ఖర్చవుతుంది. పది రోజులు తిరగకుండానే ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్‌సీపీ ఇదేరకమైన దోపిడీ, దేశంలో ఎక్కడ చూసినా చదరపు అడుగుకి రూ.4-5 వేలు దాటకపోతే ఇవేం ధరలు అని అడిగితే ఇవాళ మరింత అదనంగా ధర పెంచారు. ఈ గ్లాసులు, నిర్మాణా సామాగ్రి అంతా దిగుమతి చేసుకుంటున్నవే అని చెబుతున్నారు. అంటే వీటి ధర ఇంకా పెరిగే అవకాశముంది. పాలవాగును టవర్స్ మధ్యలో తిరుగుతూ కృష్ణానదిలో కలిపేలా డిజైనింగ్ చేస్తారట. ఆ డిజైనింగ్ కు ఇంకా రూ.వందో, రెండు వందల కోట్లో ఇస్తారు. అవి కూడా ఇంపోర్టెడే. వైయస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన 'మావిగన్' (MAVIGAN) కాన్సెప్ట్ అమరావతి దోపిడీకి అడ్డుకట్టగా మారింది. - వాస్తవం గ్రహించిన ప్రజలు: లక్షల కోట్ల వృధా ఖర్చు కంటే, కేవలం 20 శాతం వ్యయంతో అద్భుత నగరం సాధ్యమన్న జగన్ గారి ప్రతిపాదనపై ప్రజల్లో సానుకూల చర్చ మొదలైందని, దీనిని తట్టుకోలేకనే కూటమి నేతలు, ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో గగ్గోలు పెడుతున్నారు. కేవలం అమరావతి సెక్రటేరియట్ భవనాల అద్దాల కోసం రూ. 2,540 కోట్లను కేబినెట్ ఆమోదించడంపై ప్రజా ధనం దుర్వినియోగమే. చదరపు అడుగు నిర్మాణానికి రూ.12 నుంచి రూ. 14 వేల ఖర్చు ఉండగా, అదనంగా అద్దాల కోసం ఖర్చుతో కలిపి రూ. 18,500 వరకు చేరుతుందని, ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా లేని దోపిడీ. - నిరంతర దోపిడీ ప్రక్రియ: అమరావతిలో భవనాల చుట్టూ 'పాలవాగు' డిజైన్లు, 'క్వాంటమ్ వ్యాలీ' ట్విన్ టవర్స్ (రూ. 1200 కోట్లు), నగిషీలు, అద్దాల నిర్వహణ పేరుతో ఇది నిరంతరాయంగా సాగే దోపిడీ ప్రక్రియ. చంద్రబాబు తన వాళ్లకు సంపద సృష్టించేందుకే ఈ ప్లాన్ వేశారు. - అప్రజాస్వామిక నిర్ణయాలు – బరితెగింపు రెండో దశ భూ సేకరణ నోటిఫికేషన్ కంటే ముందే, అస్మదీయుల లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్న బరితెగింపును ఎవరూ ఊహించలేరు. గతంలో కూడా పోలవరం ప్రాజెక్టు మొబిలైజేషన్ కోసమూ కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. ఇది చాలా విచిత్రం. ఒకవైపు మెడికల్ కాలేజీల కోసం ఏడాదికి రూ.1000 కోట్లు చొప్పున ఖర్చుపెడితే నాలుగైదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే దానికి డబ్బులు లేవని చెబుతూ ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగిస్తున్నావు. మరోవైపు అమరావతి కోసం ఎంతైనా డబ్బులు పెట్టడానికి సిద్ధం. ఈ బరితెగింపు ఏ స్థాయికి వెళ్లిందంటే.. రెండో దశ భూములు తీసుకునే ప్రక్రియలో కూడా దోపిడీకి తెరలేపారు. రెండో దశలో ఫలానా ప్రాంతంలో భూములు తీసుకుంటున్నామని అక్కడ కూడా తమ వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 13 వ తేదీన నోటిఫికేషన్ వస్తుందని తెలిసినా 6వ తేదీన లే అవుట్ లకు అనుమతి ఇచ్చారు. అంటే దాపరికం లేని బహిరంగ దోపిడీ, అవినీతి, అడ్డగోలు తనం, అరాచకం కనిపిస్తోంది. ఒకవైపు రైతులు తమ సందేహాలను అడిగితే... దానికి సమాధానం లేదు. తనకు కావాల్సిన వాళ్లకు, దగ్గరి వాళ్ల లే అవుట్ లకు మాత్రం అనుమతిలిస్తున్నారు. పేదలకు కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేయడం చంద్రబాబుకు పేదలపై ఉన్న కక్షను తెలియజేస్తోంది. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతులకు మద్దతు ధరల కోసం నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, అమరావతి దోపిడీకి మాత్రం భారీగా నిధులు విడుదల చేయడం విడ్డూరం. - జర్నలిస్టుల వేధింపులు - జలగల్లా పీల్చేస్తున్నారు పూడి శ్రీహరి అరెస్టు నూటికి నూరుశాతం అక్రమం. ఎడిటర్ హోదాలో ఉన్న సీనియర్ జర్నలిస్టు. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి దగ్గర సీపీఆర్వో గా పనిచేశారు. ఇప్పుడు పార్టీ మీడియా విబాగం జనరల్ సెక్రటరీ గా ఉన్నారు. తను బాధ్యతాయుతమైన పదవి, హోదాలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తనకు సంబంధం లేని వ్యవహరాంలో అరెస్టు చేశారు. చంద్రబాబు చేతిలో కత్తి ఉందని అరెస్టు చేశారు. అది చేసిన వారుంటే కేసు నమోదు చేయవచ్చు. మరి వైయస్.జగన్ చేతిలో గొడ్డలి, మొహం నిండా రక్తంతో పోస్టర్లు వేసి టీడీపీ అధికారిక ఖాతాలో నేటికీ పోస్టు చేస్తున్నారు. వాటిపై ఎలాంటి చర్యలుండవు.సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒకే కేసుపై పదే పదే కేసులు పెట్టడం పోలీసుల పతనానికి నిదర్శనం. బెదిరింపులు చంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోవాలి.. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరు. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేసే శక్తి వైయస్ఆర్‌సీపీకి మాత్రమే ఉంది. - తిరుమల లడ్డూపై కల్పిత గాథ తిరుమల లడ్డూ వ్యవహారం అంతా నెయ్యి కాంట్రాక్టు ధరలను పెంచి దోచుకోవడానికి చంద్రబాబు అల్లిన 'కల్పిత గాథ'. దినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో ఎక్కడా తమ పార్టీపై ఆరోపణలు లేవు, కేవలం భక్తుల మనోభావాలను దెబ్బతీసి, దోపిడీకి మార్గం సుగమం చేసుకోవడమే దీని వెనుక ఉన్న అసలు కుట్ర. అమరావతి పేరుతో సాగిస్తున్న ఈ బరితెగింపు, అడ్డగోలు దోపిడీని ప్రజలందరూ గమనిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టేస్తూ, అస్మదీయులకు భూములను కట్టబెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే జర్నలిస్టులను వేధించడం, అక్రమ కేసులు బనాయించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. అరెస్టులతోనో, అక్రమాలతోనో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గానీ, ప్రశ్నించే గొంతులను గానీ ఆపలేరు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా సమాధి చేసే శక్తి వైయస్ఆర్‌సీపీకి ఉందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ అరాచకాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.