కుట్రపూరితంగానే 'కొమ్మినేని' అరెస్ట్

సంబంధం లేని 8 సెక్షన్ల కింద కేసుల బనాయింపు

ఏడాది పాలనా వైఫల్యాల పై డైవర్షన్‌లో భాగంగా ఈ అరెస్ట్

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం

ప్రశ్నించే మీడియాపై కూటమి బెదిరింపులు

చంద్రబాబు గైడెన్స్‌తోనే వివాదాన్ని సృష్టించారు

ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో టీడీపీ ఆందోళనలు

సాక్షిమీడియా కార్యాలయాలపై దాడులు దానికి పరాకాష్ట

మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు

తాడేపల్లి: ఏడాది పాలనలో వైఫల్యాలను మీడియాలో ఎండగడుతున్న సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలను వైయస్ఆర్‌సీపీ, సాక్షిటీవీ, వైయస్ జగన్, ఆయన కుటుంబానికి ఆపాదిస్తూ కుట్రపూరితంగా వివాదాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబు గైడెన్స్‌తోనే తాజాగా ఈ వివాదాన్ని సృష్టించి, తన పార్టీ శ్రేణులతో ఆర్గనైజ్‌డ్ ఆందోళనలు చేయించారని ధ్వజమెత్తారు. తన ప్రభుత్వంపై ఎవరూ మాట్లాడకూదడనే నిరంకుశ ఆలోచనలో భాగంగానే సాక్షిమీడియా కార్యాలయాలపై దాడులు చేయించారని అన్నారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. భారత రాజ్యాంగంలో నాలుగో పిల్లర్‌గా ఉన్న పత్రికాస్వామ్యంను కూడా చంద్రబాబు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడు. ఈ నెల ఆరో తేదీన సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మూడురోజుల్లో సాక్షిటీవీకి, వైయస్ఆర్‌సీపీ, వైయస్ జగన్, ఆయన సతీమణికి ఆపాదించే కుట్రకు బీజం వేశారు. ఈ డిబేట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల తరువాత ఒక పథకం ప్రకారం దీనిని ఎలా వివాదం చేయాలి, దీనిలో ఎవరిపైన విష ప్రచారం చేయాలనే దానిపై చంద్రబాబు, లోకేష్‌లు సమాచాలోచనలు చేశారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సోషల్ మీడియా ద్వారా దీనిపై రెచ్చగొట్టేలా ఒకరి తరువాత ఒకరు స్పందించడం, ఆ వెంటనే టీడీపీ శ్రేణులు హటాత్తుగా ఆందోళనలు చేయడం చూస్తుంటే ఇది కుట్రేనని అర్థమవుతోంది. ఒకవైపు దీనిపై సాక్షిటీవీ, వైయస్ఆర్‌సీపీ చాలా స్పష్టంగా ఈ వ్యాఖ్యలను సమర్థించడం లేదని, అవి తమకు ఆపాదించడం సరికాదని వివరణ ఇచ్చాయి. అలాగే ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా తాను మొత్తం మహిళా లోకంను కించపరిచే ఉద్దేశంతో అటువంటి వ్యాఖ్యలు చేయలేదని, సబ్జెక్ట్‌ చర్చల్లో భాగంగానే వాటిని చేశానని, దీనిపై ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే తాను క్షమాపణలు చెబుతున్నానంటూ ప్రకటన కూడా చేశారు.

ప్రశ్నించే గొంతులను నొక్కేసే రాక్షసత్వం

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేసే రాక్షస పాలన సాగుతోంది. తాజాగా కొమ్మినేని అరెస్ట్‌ లో జరిగిన దానిని గమనిస్తే, ఈ ప్రభుత్వ ఎంత దారుణంగా పనిచేస్తుందో ప్రజలకు అర్థమవుతుంది. సాక్షీటీవీ డిబేట్‌ సందర్భంగా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వారించిన ప్రజంటేటర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ తరువాత కూడా ఆ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ఖండించారు. కానీ మొటి నుంచి ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ఎలా వైయస్ఆర్‌సీపీపై బుదరచల్లాలా అనే ఆలోచనతో ఉన్న చంద్రబాబు, లోకేష్‌లు వెంటనే దీనిపై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను ఉసికొల్పారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును నిన్న హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి అమరావతికి తీసుకువచ్చారు. ఆయనపై 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తీవ్రమైన నేరాల విషయంలో పెట్టే సెక్షన్ల కింద ఆయనపై కేసులు బనాయించారు. ఆఖరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అంటే తమను ఎవరైనా సరే మీడియా ముఖంగా ప్రశ్నిస్తే ఇలాగే తప్పుడు కేసులు బనాయించి, వేధిస్తామని కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది. మీడియాలో నిస్పక్షపాతంగా వ్యవహరించే పాత్రికేయుడిగా కొమ్మినేని శ్రీనివాసరావుకు మంచి పేరు ఉంది. గతంలో ఎన్టీవీలో ఇదే విధంగా ఆయన పనిచేస్తుండటంతో తట్టుకోలేక ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు కక్షకట్టి ఆయనను ఉద్యోగం నుంచి తొలగించిన విషయం పాత్రికేయ లోకంలో అందరికీ తెలుసు. ఇప్పుడు సాక్షిటీవీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కొమ్మినేని ఎండగడుతున్నాడనే కక్షతోనే ఈ వివాదాన్ని సృష్టించి, దానిలో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి ఏడాది పాలనపై ఇటీవలే వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన వెన్నుపోటుదినం కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాస్పందన వచ్చింది. దాని నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్‌ చేసేందుకే కొమ్మినేని అరెస్ట్. ఏడాది కాలంగా రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. కేవలం కక్షసాధింపు చర్యలకే పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. మహిళలకు రక్షణ లేని దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తాజాగా అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య దీనికి నిదర్శనం.

Back to Top