తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లతో పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 12 మంది రీజనల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. రీజనల్ కో–ఆర్డినేటర్లు కచ్చితంగా జిల్లాలకు వెళ్లి ఈ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. కలసి నడుద్దాం.. ఘనవిజయం సాధిద్దాం ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉందని, సమన్వయంతో అంతా కలసి పనిచేయడం ద్వారా ఘనవిజయం సాధిద్దామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. వారికి నిర్దేశించిన జిల్లాల్లో నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సమర్థంగా నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది అందర్నీ ఒక్క తాటిపైకి తేవాలని సూచించారు. అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీ రావాలని, ఆ లక్ష్యంతోనే పనిచేయాలని నిర్దేశించారు. పార్టీ సమన్వయకర్తలుగా వారు తనతో ఏ విషయాన్నైనా చర్చించవచ్చని, ఎప్పుడైనా కలవవచ్చని సూచించారు. ‘పార్టీ పరంగా మీరు నా టాప్ టీమ్’ అని పేర్కొన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల రూపంలో చక్కటి యంత్రాంగం ఉందని, వలంటీర్లను వారితో మమేకం చేయాలన్నారు. ఈ యంత్రాంగం చురుగ్గా పని చేసేలా, క్రియాశీలకంగా వ్యవహరించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. వాటిని సజావుగా, సమర్థంగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వర్తించేలా పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలను స్వీకరించాలని సూచించారు. ‘మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలసి ముందుకుసాగితే ఎన్నికల్లో విజయభేరి మోగించడం తథ్యం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.