చంద్రబాబు అండదండలతోనే విశాఖలో భూకబ్జాలు

 మంత్రి అవంతి శ్రీనివాస్ 

  ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఓ యజ్ఞంలా చేస్తోంది 

 గత 5 నెలల్లోనే ఆక్రమణలకు గురైన రూ. 4,776 కోట్ల విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది 

 విశాఖలో టీడీపీ నేతల భూ కబ్జాలు-ప్రభుత్వం స్వాధీనంపై కమ్యూనిస్టులు, ప్రతిపక్షాలు, పౌర సమాజం స్పందించాలి 

  విశాఖలో టీడీపీ నేతలు వందలాది ఎకరాలు కబ్జా చేశారు.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే 

 చంద్రబాబు పాలనలో దోచుకోవడం, దాచుకోవడమే విధానంగా మారింది*

 అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే  ప్రభుత్వ లక్ష్యం.. విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరుతాం 

విశాఖ‌ప‌ట్నం: టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా టీడీపీ నేతలు పెద్దఎత్తున భూకబ్జాలు, భూ కుంభకోణాలకు పాల్పడి, దాచుకోవడం-దోచుకోవడం ద్వారా వేలకోట్ల రూపాయల భూ దోపిడీ చేశారని పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) విమ‌ర్శించారు. విశాఖపట్నంలో సర్క్యూట్ హౌస్ లో సోమవారం జరిగిన విలేక‌ర్ల సమావేశంలో మంత్రి అవంతి మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో కబ్జాలకు గురైన 430 ఎకరాల భూములు అంటే మార్కెట్ విలువ ప్రకారం  రూ. 4,776 కోట్ల విలువైన భూములను ఈ ప్రభుత్వం గత 5 నెలల్లో స్వాధీనం చేసుకుందని తెలిపారు. చంద్రబాబు హయాంలో  ఇంతపెద్దఎత్తున భూ ఆక్రమణలు జరిగితే.. వాటిని  వైయస్ఆర్ కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే కమ్యూనిస్టులతో సహా మిగతా పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దీనిపై పౌర సమాజం కూడా స్పందించాలని మంత్రి కోరారు. 

 ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. గడిచిన అయిదు నెలల్లో కబ్జా జరిగిన 430 ఎకరాల భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్న భూమి విలువ రికార్డుల ప్రకారం రూ.2600 కోట్లు ఉంటే... బహిరంగ మార్కెట్‌లో రూ.4776 కోట్లు పలుకుతోంది. ఇంత ఖరీదైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవడం తప్పా? తప్పు తప్పే... తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిందే అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. దీనిమీద పౌర సమాజం స్పందించాలి. ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో చేపట్టిన ఈ యజ్ఞానికి ప్రతిపక్షాలు మద్దతు పలికాలి. 

జల్-జంగిల్-జమీన్.. అని నినదించే కమ్యూనిస్టు పార్టీలు భూ ఆక్రమణలపై మాట్లాడాలి. జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, టీడీసీ సహా అన్ని పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలి. భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తే కక్ష సాధింపు అంటున్నారు. మరి స్వాధీనం చేసుకున్న భూముల్లో ఎక్కువ శాతం భీమిలి ప్రాంతానికి చెందినవే ఉన్నాయి. భీమిలి శాసనసభ్యుడిని నేను. అంత మాత్రాన ముఖ్యమంత్రి నా మీద కక్ష సాధించినట్టా..!?

 భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవడం తప్పా? ప్రతిపక్ష పార్టీల విమర్శలపై పౌర సమాజం స్పందించాలి. దొరికితేనే దొంగలు.. అన్న చందంగా టీడీపీ బండారం బట్టబయలు అవుతుంది. కబ్జాలకు గురైన భూములు స్వాధీనం చట్టప్రకారమే జరుగుతుంది.  ఎవరిపైనా కక్ష సాధింపులుగానీ, మరొకటిగానీ లేవు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుపై , మరో మంత్రి అయ్యన్నపాత్రుడు భూ కుంభకోణాలపై పరస్పరం విమర్శలు చేసుకుని, సిట్‌కు ఫిర్యాదు చేసుకోలేదా? టీడీపీ నేతలు చేస్తేనేమో మంచి... అదే మేము చేస్తేనేమో కక్ష సాధింపా..?

విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఎస్టేట్‌, ఈనాం భూములు ఉన్నాయి. వాటిలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని కొంతమంది ఆక్రమణదారులు వాటిని ఆక్రమించుకున్నారు.  పేదవారు పేదవాళ్లుగా ఉండిపోతే ... కొంతమంది పెద్దలు రాజకీయ అండలతో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. అయితే మా ప్రభుత్వ ఉద్దేశం... ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇళ్లు కట్టించి ఇద్దామంటే టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి ఆపేస్తారు.

విశాఖలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములు ఉన్నట్టు అధికారులు నిగ్గు తేల్చారు.  విశాఖ భూములపై సిట్‌ నివేదిక ఆధారంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలకు పాల్పడిన టీడీపీ నాయకులు ఇప్పుడు వాటిని కప్పిపుచ్చుకునేందుకు, ముఖ్యమంత్రి గారి మీద, విజయసాయిరెడ్డి గారి మీద, పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. మా మీద విమర్శలు చేస్తున్న వెలగపూడి రామకృష్ణ 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా పేదలకు ఓ షెడ్‌ కూడా కట్టించలేకపోయారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేకాటలు, బారు షాపుల బిజినెస్‌లతోనే బిజీగా గడిపేవారు. 

టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలని మాట్లాడుతున్నారు. ఉదాహరణకు వెలగపూడి రామకృష్ణపై వ్యక్తిగతంగా కోపం ఉందంటే... ఏదో ఒకసాకుతో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు చెబితే అది ఎక్కడైనా సాధ్యపడుతుందా? దొంగలను పోలీసులు పట్టుకుంటే... దొంగలతో పోలీసులు చర్చిస్తారా? భూ ఆక్రమణలపై పల్లా శ్రీనివాస్‌ తనకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఎవరి ఆస్తులో తనపేరు చెబుతూ కూల్చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు ఎప్పుడూ ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం ఉండదు. ఆయన చేయలేకపోయిన పనిని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి. భూకబ్జాలపై గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. భూ కబ్జాలకు పాల్పడితే జనం ఓటు ఎందుకు వేస్తారు.  అందుకే మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ, ఇప్పటికీ ఆయన చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడం లేదు.

 సింహాచలం భూములకు సంబంధించి మాపై టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎండోమెంట్‌ భూములను తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు. దయచేసి గత చరిత్రను తవ్వుకోవద్దు. మీరు పది అంటే మేము వంద అంటాం. మంచి కార్యక్రమాన్ని అందరూ స్వాగతించాలి. ఉత్తరాంధ్రలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఓ యజ్ఞంలా చేస్తోంది. సినిమా ఇంకా ముందుంది. ఇప్పుడే అయిపోలేదు. జనాలకు ఎంతకాలం చెవిలో పూలు పెడతారు? భూములు కబ్జా చేసి, దొరికిన తర్వాత కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తారా? బహిరంగ చర్చ, రాజకీయ సన్యాసం.. దేనికైనా సిద్ధం  అంటూ సవాల్‌ విసరడం కాదు.  ఎవరు దొంగలో, ఎవరు దొరలో త్వరలోనే తేలుతుంది.

 మూడు రాజధానులకు అడ్డుపడొద్దు బాబూ.. 
 చంద్రబాబు మీ వైఖరి మార్చుకోండి. మూడు రాజధానులకు అడ్డుపడవద్దు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు, సీట్లు కావాలి కానీ వారి అభివృద్ధి మీకు పట్టదా? పార్టీ లేదు.. బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు మీ చెవులకు వినిపించాయా, లేదా..? ముఖ్యమంత్రిని, విజయసాయిరెడ్డి గారిని తిడితే ఏదో అయిపోతుందనుకుంటున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం తగదు. రఘురామకృష్ణరాజు లాంటి అరాచక శక్తులను అడ్డు పెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు.

  ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, అధికారులకు ఉంటుంది. అర్థరాత్రి షెడ్లను కూల్చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. మేము ధర్మంగా, న్యాయబద్ధంగా వెళుతుంటే... వారు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు.
దొంగతనం చేసినవాడు... దొంగతనం చేశానని చెబుతారా?. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములనే స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో, న్యాయబద్ధంగా ముందుకు వెళుతోంది. 

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తున్నారు. ఆయనకు ప్రజలంతా ఒక్కటే. కులం, మతం, రాజకీయపరంగా ప్రజలను విడదీసి చూడటం లేదు. అందర్నీ సమాన దృష్టితో చూస్తున్నారు కాబట్టే, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయి.  ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలకు మంచి మనసు ఉంటే మద్దతు ఇవ్వాలి. అంతేకాని గోబెల్స్‌ ప్రచారం చేయడం సరికాదు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరుతాం.

 మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను చెడగొట్టొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్‌ హితవు పలికారు.

Back to Top