పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దు

పోలవరానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం

లోక్‌సభలో ఎంపీ మిథున్‌ రెడ్డి

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దని లోక్‌సభలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని ఆయ‌న ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. 

అన్యాయాన్ని ఎదురించేందుకు ఐక్య పోరాటం:
‘‘పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ప్ర‌ధాన ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని మిధున్‌రెడ్డి హెచ్చ‌రించారు.  

బ‌న‌క‌చ‌ర్ల‌కు నీరు ఎలా అందుతుంది?
‘‘ పోల‌వ‌రం కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్లకు నీరు ఎలా అందుతుంది?. రాయలసీమకు నీరేలా ఇస్తారు? 
ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలి’’ అని మిధున్‌రెడ్డి డిమాండు చేశారు. 

ఇంగ్లీష్‌, తెలుగు రెండూ కొన‌సాగించాలి
ఏపీ ప్రభుత్వ పాఠశాలలో  ఇంగ్లీష్ మీడియాన్ని మెల్లగా రద్దు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో  ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలి.  విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి 

మార్గదర్శక కుంభకోణం పెద్దది:
ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారు. సహారా, శారద కుంభకోణం కంటే మార్గదర్శక కుంభకోణం పెద్దది. మార్గదర్శిపై రూ. 1,000 కోట్ల రూపాయల జరిమానా విధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా  వాటిని రెన్యువల్ చేస్తున్నారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలి. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాల‌ని మిధున్‌రెడ్డి కోరారు.

Back to Top