ఈనెల 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు 

16,208 పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు

సచివాలయ పోస్టుల భర్తీలో జాగ్రత్తలు తీసుకోవాలి

కలెక్టర్లు, ఎస్పీలకు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

అమరావతి: కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీలో జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు మాట్లాడారు. ఈనెల 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. కరోనా నేపథ్యంలో సచివాలయ పోస్టుల భర్తీలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ అభ్యర్థులకు ఐసోలేషన్‌ రూమ్‌లు సిద్ధం చేశామని, పీపీఈ కిట్‌లతో ఐసోలేషన్‌ రూమ్‌లో ఇన్విజిలేషన్‌ ఉంటుందన్నారు. పరీక్షల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా, అభ్యర్థులకు అసౌకర్యం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను మంత్రులు ఆదేశించారు.  
 

తాజా వీడియోలు

Back to Top