పచ్చ అక్రమాల పుట్ట పగులుతోంది

గుంటూరు జిల్లా గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కు పాల్పడినట్టు సిఐడీ నివేదిక నిర్థారించింది. ఈ కేసును సీబీఐ కి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అన్నది ధర్మాసనం. గతంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని చలవతో అక్రమమైనింగ్ ,పేకాట క్లబ్బులు,విచ్చలవిడిగా మద్యం, గంజాయి అమ్మకాలలో గురజాల బాగా దూసుకుపోయింది. అధికారం అండ చూసుకుని పల్నాడులో యరపతినేని, అతడి అనుచరులు చేయని దాష్టీకాలు లేవు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే ఖనిజసంపద దోచుకున్న దేశం నేత అధికారులను, పోలీస్ యంత్రాగాన్నీ పావులుగా వాడుకున్నాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యరపతినేని మైనింగ్ అక్రమాలను బైటపెట్టేందుకు ప్రయత్నించారు. నిజనిర్థారణ కమిటీ వేసి గురజాలకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులను అడ్డుకుని, అరెస్టులు చేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. అక్రమ మైనింగ్ చేసిన పచ్చనేతను కాపాడేందుకు చంద్రబాబు విఫలయత్నం చేసాడు. చివరకు  హైకోర్టు  జోక్యం చేసుకుని సీరియస్ అయిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. తప్పనిసరి స్థితిలో ప్రభుత్వం తమ ఎమ్మెల్యేపైనే సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు నివేదిక అందుకున్న హైకోర్టు అక్రమ మైనింగ్ జరిగినట్టుగా నిర్థారించింది. తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. 
అయితే కథ ఇంతదాకా రావడానికి ముందు చాలా తతంగం నడించింది. యరపతినేని అంటే మాఫియా, అక్రమ మైనింగ్ అంటే యరపతినేని అన్నట్టు ఉండేది పల్నాడు ప్రాంతంలో. అధికార పార్టీ నేత కావడంతో యరపతినేని ఒత్తిడికి తలొగ్గి 7 గనులకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే అదునుగా ఇష్టానుసారంగా తవ్వుకుని, వెయ్యికోట్లు విలువైన సున్నపురాయిని తరలించారు. 31లక్షల టన్నుల అక్రమ మైనింగ్ జరిగినట్టు అధికారిక నివేదిక చెబుతోంది. లోకాయుక్తా హెచ్చరించినా, కోర్టు ఆగ్రహించినా, సీబీసీఐడీ విచారణ జరుగుతున్నా అధికారపార్టీ అండతో అడ్డగోలుగాదోచుకున్నాడు యరపతినేని. మైనింగ్ అధికారులు, పోలీసులను గుప్పెట్లో పెట్టుకునే ఈ దందా అంతా సాగించాడు. ప్రశ్నిస్తే అనుచరులతో బెదిరింపులు, దాడులు చేయించాడు. ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. యరపతినేని అనుచరుడు కనిగిరి శ్రీనివాసరావుకు ఒకప్పుడు ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన అక్రమ గ్రానైట్ క్వారీని నడిపి కోట్లు సంపాదించిన చరిత్ర ఉంది. మరో అనుచరుడు బ్రహ్మానందం స్థానికులను బెదిరించి భూములు ఆక్రమించుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇలా రౌడీయిజంతోనే పల్నాడులో తన పరపతి పెంచుకున్నాడు యరపతినేని. మైనింగ్ డాన్ గా అవతరించాడు. 
యరపతినేని శ్రీనివాసరావుపై ఇన్ని ఆరోపణలు వచ్చినా అతడిని తప్పించేందుకు భారీగా ప్రయత్నాలు జరిగాయి. ఎమ్మెల్యేకు చెందిన క్వారీల్లో డ్రైవర్లను, కూలీలను మాత్రమే ప్రశ్నించారు. వారే స్వయంగా యరపతినేనికి చెందిన క్వారీలో పనిచేస్తున్నామని చెప్పినా, అసలు నిందితుడైన యరపతినేని ని కనీసం విచారించలేదు. అందుకే విచారణ మొదలుపెట్టి ఏడాది అయినా, సిఐడీ కోర్టుకు 8 సార్లు నివేదిక సమర్పించినా ప్రధాన నిందితుడైన యరపతినేని వ్యవహారంలో ఏ పురోగతీ లేదు. కేసు సాగదీతపై హైకోర్టు సీరియస్ కావడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. మనీలాండరింగ్ జరిగి ఉంటుందన్న కోణంలో సీబీసీఐడీ ఎందుకు విచారణ చేయడం లేదని కూడా కోర్టు కలుగజేసుకుని ప‌్రశ్నించాల్సి వచ్చింది. మొత్తానికి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో, వాటిని ఎలా కప్పిపుచ్చి వ్యవస్థలపై పెత్తనం చేసారో ఆధారాలతో సహా బయటపడుతోంది. పచ్చ అక్రమాల పుట్ట పగులుతోంది. 

తాజా వీడియోలు

Back to Top