అమరావతి: మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది ఎవరని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు? ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో పలు అంశాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సమావేశాల్లో భాగంగా ఇవాళ మద్యం బెల్టు షాపులపై జరిగిన చర్చలో బొత్స సత్యనారాయణ, వరుదు కళ్యాణి, తోట త్రిమూర్తులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టబట్టే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. ఈ పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. గతంలో ఉన్న బ్రాండ్లే ఇప్పుడూ అమ్ముతున్నారని, ఆ బ్రాండ్లను ఎందుకు బ్యాన్ చేయలేదని నిలదీశారు. సభలో మాట్లాడటానికి మాకు హక్కు లేదని మంత్రి అచ్చెన్న మాట్లాడటం సరికాదన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చారని, దానికి తూట్లు పొడిచింది మీరు కాదా అన్నారు. సతివాడలోని ఒక బెల్ట్ షాపును 50 లక్షలకు వేలం పాడారని బొత్స సత్యనారాయణ సభ దృష్టికి తెచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 10 వరకూ అమ్ముకోవడానికి వేలం పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్ని లైసెన్స్ లు రద్దు చేశారు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మద్యం బెల్టు షాపులు వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు బెల్టు షాపులు వల్ల విపరీతంగా పెరిగాయన్నారు. మద్యం అమ్మకాలు 18 శాతం, బీర్ల అమ్మకాలు 40 శాతం పెరిగాయన్నారు. స్కూల్స్, కాలేజీల దగ్గర లోనే బెల్టు షాపులు పెట్టారని విమర్శించారు. బెల్టు షాపులు పెడితే 5 లక్షలు జరిమానా అన్నారని, మరి ఎంత మందికి వేశారని ప్రశ్నించారు. బెల్టు షాపులు పెడితే మద్యం షాపులు రద్దు చేస్తామన్నారు..ఎన్ని లైసెన్స్ లు రద్దు చేశారని సభలో వరుదు కళ్యాణి నిలదీశారు. ఎంతమందికి బెల్టు తీశారు చెప్పండి: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సీఎం చంద్రబాబు బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తాం అన్నారని, ఇప్పటి వరకు ఎంతమందికి బెల్టు తీశారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. మద్యం బెల్టు షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. ఐదు లక్షల ఫైన్ వేస్తామన్నారని, ఇప్పటి వరకు ఎన్ని బెల్టు షాపులకు ఐదు లక్షలు ఫైన్ వేశారన్నారు. ఎన్ని బెల్ట్ షాపులు మూయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని త్రిమూర్తులు పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికార పక్షం ఎదురుదాడికి దిగడం గమనార్హం.