ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తే చర్యలు

పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు 
 

 
తాడేపల్లి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యా సంస్థల యాజమాన్యాలు  ఫీజులు  కట్టాలంటూ పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీ ఫీజులపై పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు పలు ఆదేశాలు జారీచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఫీజులు కట్టాలని ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.

అది కూడా మొదటి త్రైమాసిక కాలం ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. మొదటి త్రైమాసిక ఫీజును కూడా రెండు విడతలుగా వసూలు చేయాలని చెప్పారు. రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పేరుతో ఎవ్వరికీ అడ్మిషన్లు తిరస్కరించకూడదని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Back to Top