ట్రాక్టర్‌ ప్రమాదంపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌

పది మంది మిర్చి కూలీల దుర్మరణం  

ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం వైయస్‌ జగన్‌

సహాయక చర్యలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆదేశం

 ప్రకాశం:  ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం సమీపంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. కుమ్మరిడొంక వద్ద మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే 9 మంది దుర్మరణం పాలయ్యారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

 సహాయక చర్యలకు ఆదేశం 
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో కూలీలు మరణించిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, బాధిత కుటుంబాలను పరామర్శించాలని జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు.

బాధితులను ఆదుకుంటాం : మంత్రి బాలినేని 
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన అధికారులను అప్రమత్తం చేసి ఘటనాస్థలానికి పంపించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల పరామర్శ
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కాకుమాను భాగ్యలక్ష్మి, నల్లూరి చెంచయ్యలను జీజీహెచ్‌ అత్యవసర విభాగానికి తరలించారు. చెంచయ్యకు కాలు తెగిపోగా శరీరంలో సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. భాగ్యలక్ష్మి శరీరం కూడా 70 శాతం కలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చికిత్స పొందుతూ కాసేపటి తర్వాత చెంచయ్య మృతి చెందాడు. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్‌ఎంఓ వేణుగోపాలరెడ్డి పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. కాగా, అంతకు ముందు క్షతగాత్రులను జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్, జేసీ మురళి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు మాదిగతో పాటు మద్దిపాడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమాలపు కృష్ణారెడ్డి తదితరులు పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును కలెక్టర్‌ భాస్కర్, జేసీ వెంకట మురళి వాకబు చేశారు.

Back to Top