సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త ఇసుక విధానం

ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు

ప్రస్తుత రేట్ల  కన్నా తక్కువ రేట్లకే ఇసుక అమ్మకాలు

ఇసుక అక్రమ తవ్వకాలు,అక్రమ రవాణదారులపై కఠినచర్యలు 

పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం

కొత్త ఇసుక పాలసీ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: ఏపీలో సెప్టెంబర్‌ 5 నుంచి  కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. కొత్త ఇసుక విధానం రూపకల్పనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సమీక్ష నిర్వహించారు. ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని  నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రేట్ల  కన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.అవినీతి లేకుండా. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని తెలిపారు. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌ యార్డులు,నగరాలు,పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు ఏర్పాటుకు ఆదేశించారు. ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు, స్టాక్‌ యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంత వరుకు మరొక రశీదు ఇవ్వాలని తెలిపారు.

ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, వేబ్రిడ్జిల ద్వారా లెక్కింపుకు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక తవ్వకాలు,తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు,అక్రమ రవాణదారులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏపీఎండీసీ ద్వారా యాప్,వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలని తెలిపారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంత వరుకు ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగిస్తారని వెల్లడించారు.కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో మత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్,మేకతోటి సుచరిత,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్,ఉన్నతాధికారులు అజేయ్‌ కల్లం,రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top