ఏపీలో 40 ఎఫ్‌సీఐ వేర్‌హౌస్‌లు 

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

 పామాయిల్‌ సాగు ప్రోత్సాహానికి రూ.11 వేల కోట్లు : విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి జ‌వాబు
 

 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీఐకు చెందిన సొంత, అద్దె గోదాములు 40 ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌చౌబే తెలిపారు. వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న వేర్‌హౌస్‌లు సెంట్రల్‌పూల్‌ స్టాక్‌కు సరిపోతాయని చెప్పారు.  

 

దేశంలో పామాయిల్‌ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి  నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌–ఆయిల్‌ పామ్‌ (ఎన్‌ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్‌ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్‌ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్‌ఎంఈవో  బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్‌ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు.  

 ఏపీ ప్రతిపాదనలకు అనుమతి 

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)లో ఏపీ పంపిన ప్రతిపాదనలను అనుమతించామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రూ.657.11 కోట్ల పనులకు అనుమతించి ఇప్పటివరకు రూ.108.95 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, ఓడరేవుల్లో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతోపాటు ఫిష్‌ రిటైల్‌ హబ్‌ తదితర పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు.  

పీపీపీ పద్ధతిలో ఎంవీయూలు 
పశువుల సంరక్షణ నిమిత్తం సేవలు నేరుగా రైతుల ఇంటివద్దే అందించేలా మొబైల్‌ వెటర్నరీ యూనిట్లను (ఎంవీయూలను) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో తీసుకొచ్చినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను, ఏజెన్సీలు (కోఆపరేటివ్, మిల్క్‌ యూనియన్లు) మానవ వనరులను ఏర్పాటు చేస్తాయని వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

లబ్ధిదారుల్ని పెంచాలని ఏపీ కోరింది 
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)లో లబ్ధిదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంతంలో 75, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2011 జనాభా లెక్కలననుసరించి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41.14 శాతం లబ్ధిదారుల్ని గుర్తించినట్లు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top