కేసుల‌కు భ‌య‌ప‌డి బీజేపీతో పొత్తుకు చంద్ర‌బాబు తహ‌త‌హ‌..

పనికిమాలిన లోకేష్‌ను ప్ర‌జ‌ల మీద రుద్దేందుకు ప్ర‌య‌త్నం

చంద్ర‌బాబు తీరుపై నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి మండిపాటు

గుంటూరు: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ప్రతీవాళ్ల కాళ్ల దగ్గర తాక‌ట్టుపెడుతున్నాడ‌ని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కురాలు నందమూరి లక్ష్మీపార్వతి మండిప‌డ్డారు. కేసుల భయంతో చంద్రబాబు బీజేపీలో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని విమర్శించారు. లక్ష్మీపార్వతి శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్‌ ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోందన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితి దిగ‌జార్చాడ‌న్నారు. మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాడ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడని, నేడు కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడన్నారు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడని, అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకుని కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడన్నారు.  

నారా లోకేష్‌ ఓ పనికిమాలిన వ్యక్తి అని, లోకేష్‌ను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చంద్ర‌బాబు చేస్తున్నాడ‌న్నారు. చంద్రబాబును ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో ఆయన సభలను చూస్తే అర్థమవుతుంద‌న్నారు. పచ్చ మీడియా కూడా లోకేష్ మాదిరిగానే మారిందని, లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని బాకా ఊదుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పారు.

Back to Top