నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఉత్తర్వులు విడుదల 

అమరావతి:  నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. గవర్నర్‌ ఆమోదంతో ఎన్నికల కమిషన్‌ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, కొయ్యే మోషేన్‌ రాజు, రమేష్‌ యాదవ్‌లను ఎమ్మెల్సీగా ఈసీ ప్రకటించింది. 

కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ  రమేష్‌ యాదవ్ 

 కడప జిల్లా నుంచి చట్టసభల్లో బీసీలకు అవకాశం దక్కటమంటే ఒక చరిత్రే!! ఎందుకంటే ఇక్కడ చివరిసారిగా 1962లో కాంగ్రెస్‌ తరఫున కుండ రామయ్య జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ తరవాత ఏ పార్టీ తరఫున కూడా ఎవ్వరూ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు. పోనీ ఎమ్మెల్సీగా అయినా బీసీలకు అవకాశమిచ్చారా అంటే... ఏ పార్టీ కూడా అందుకు ముందుకు రాలేదు. బలహీనవర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ కాదు బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌... చేతల్లో కూడా అది చూపించారు. తాజాగా గవర్నర్‌ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్‌ చేస్తూ కడప జిల్లా చరిత్రను తిరగరాశారు. అక్కడి నుంచి రమేష్‌ యాదవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. 

వీటికి గవర్నరు ఈ నెల 10న ఆమోదముద్ర వేయగా సోమవారం అధికారికంగా ప్రకటించటం తెలిసిందే. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ శానస మండలి ఏర్పాటయిన తరవాత కడప జిల్లా నుంచి మొత్తం 30 మంది ఎమ్మెల్సీలను ఇప్పటిదాకా వివిధ పార్టీలు నామినేట్‌ చేశాయి. వారిలో యాదవ సామాజిక వర్గానికి మాత్రం ఇప్పటిదాకా అవకాశం దక్కలేదు. ఇదే తొలిసారి. దీనిపై రమేష్‌ స్పందిస్తూ ‘‘నన్ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ జిల్లా నుంచి యాదవ వర్గానికి చెందినవారెవరూ ఇప్పటిదాకా ఎమ్మెల్సీ కాలేదు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. రమేష్‌ యాదవ్‌ తండ్రి వెంకటసుబ్బయ్య 1987లో ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రమేష్‌ యాదవ్‌ ఎమ్మెల్సీ కావడం పట్ల జిల్లా బీసీలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. 

జగన్‌ హయాంలోనే బడుగులకు అధికారం 
తాజాగా నామినేట్‌ చేసిన మోషేన్‌రాజు (పశ్చిమగోదావరి), రమేష్‌యాదవ్‌ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు)లో సగం... అంటే ఇద్దరు ఎస్సీ, బీసీలకు చెందిన వారు కావటం గమనార్హం. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారకంలోకి వచ్చాక వైఎస్సార్‌ సీపీ తరఫున ఇప్పటిదాకా 15 ఎమ్మెల్సీ స్థానాలను నామినేటెడ్, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికల ద్వారా భర్తీ చేయగా... ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు దక్కాయి. ప్రతిపక్షంలో ఉండగా 2018 తర్వాత భర్తీ చేసిన ఎమ్మెల్సీల్లోనూ బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 12 సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దే. ఈ క్రమంలోనే బీసీ నేత జంగా కృష్ణమూర్తికి వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవకాశం లభించింది. సామాజిక న్యాయమనేది మాటల్లో కాకుండా చేతల్లో జగన్‌ ఏ మేరకు చూపిస్తున్నారనేది తెలియటానికి ఈ ఉదంతాలు చాలు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top