కృష్ణా జిల్లా: ఇంటింటికీ సంక్షేమ పథకాలను చేరవేసి ప్రజలకు సేవలందించిన వాలంటీర్లకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం జోన్-3 అధ్యక్షురాలు మైల రత్నకుమారి పేర్కొన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలను తమకు జరిగిన మోసానికి సమాధానం చెప్పే సువర్ణ అవకాశంగా వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. వాలంటీర్ వ్యవస్థకు గుర్తింపు, గౌరవం కల్పించిన ఘనత వైయస్ జగన్‌దే “వైయస్ జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో సాధారణ గృహిణులు, నిరుద్యోగులు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న ఎంతోమందికి అవకాశం కల్పించారు. కుటుంబాలకే పరిమితమైన మహిళలకు, ఉపాధి అవకాశాలు లేని నిరుద్యోగులకు వాలంటీర్లుగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత జగన్‌గారిదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికీ చేరేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలోనూ ప్రజలకు సేవలందించడంలో వాలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషించింది.” రూ.10 వేల గౌరవ వేతనం, ఉద్యోగాల పర్మినెంట్ హామీలు ఏమయ్యాయి? “వాలంటీర్లు అంటే ప్రజలకు సేవలందించే వ్యవస్థ. అలాంటి సేవలందించే వారికి గౌరవం ఇవ్వాలి, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించాలి అనే ఉద్దేశంతో జగన్‌గారు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం అందించారు. కానీ చంద్రబాబు ఎన్నికల సమయంలో నెలకు రూ.10 వేలు ఇస్తామని, తమకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే వాలంటీర్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలను నమ్మిన వాలంటీర్లకు న్యాయం జరిగిందా? అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను నిరాశకు గురిచేసి, వారి వ్యవస్థనే నిర్వీర్యం చేసిన పరిస్థితి ఏర్పడింది. హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేయడమేనా చంద్రబాబు పాలన అంటే?” ప్రజల మనసుల్లో జగన్‌గారికి ప్రత్యేక స్థానం “వాలంటీర్లందరూ ఒక్కసారి ఆలోచించండి. జగన్‌గారు మీకు గుర్తింపు, గౌరవం కల్పించారు. ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా లభించని గౌరవాన్ని ప్రజల్లో వాలంటీర్లకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్‌గారు అధికారంలో లేకపోయినా, ప్రజల మనసుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మీకు చేసిన మేలు, మీ సేవలకు కల్పించిన గుర్తింపును మర్చిపోవద్దు. స్థానిక సంస్థల ఎన్నికలు మీకు లభించిన అవకాశంగా భావించి, మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. వైయస్ జగన్ నాయకత్వంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మీ మద్దతు తెలియజేసి, వాలంటీర్లకు జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయాన్ని ఓటు ద్వారా వ్యక్తపరచండి.” అంటూ మైల రత్నకుమారి పిలుపునిచ్చారు.