జల్లెడపట్టి మరీ ఇవ్వాలనే జ‌గ‌న‌న్న‌ మాట గొప్పది  

పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ 

తాడేప‌ల్లి: అర్హత ఉండి పధకాలు అందుకోనివారికి కూడా అందజేసి గ్రామంలోని ఆఖరి కుటుంబం వరకు సంక్షేమం అందాలన్న మీ ఆలోచనకు జేజేలు అంటూ పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కొనియాడారు. ఇంకా లబ్ధి పొందని వారిని చూసి మరీ జల్లెడపట్టి మరీ ఇవ్వాలనే మీ మాట గొప్పది, ఇది మీ విస్వసనీయతకు సాక్ష్యం, ఠంచన్‌ పెన్షన్‌ ఇవ్వడమే కాదు పెన్షన్‌ పెంచాలన్న మీ నిర్ణయంపై మీ పట్ల నమ్మకం, విశ్వాసం మరింత పెరిగాయ‌న్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ...సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డ‌బ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి, ల‌బ్ధిదారులు మాట్లాడారు.

మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఏమన్నారంటే...వారి మాటల్లోనే

అందరికీ నమస్కారం, రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలుచేయలేనన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టారు, దేశంలో మరే రాష్ట్రం డీబీటీ ద్వారా సుమారు రూ. 2.46 లక్షల కోట్లుపైగా ఇంత పెద్ద మొత్తంలో నేరుగా ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. పాదయాత్రలో ప్రజల కష్టాలు కన్నీళ్ళు స్వయంగా చూసి ఇన్ని పథకాలకు రూపకల్పన చేశారు, అర్హత ఉండి పధకాలు అందుకోనివారికి కూడా అందజేసి గ్రామంలోని ఆఖరి కుటుంబం వరకు సంక్షేమం అందాలన్న మీ ఆలోచనకు జేజేలు, ఇంకా లబ్ధి పొందని వారిని చూసి మరీ జల్లెడపట్టి మరీ ఇవ్వాలనే మీ మాట గొప్పది, ఇది మీ విస్వసనీయతకు సాక్ష్యం, ఠంచన్‌ పెన్షన్‌ ఇవ్వడమే కాదు పెన్షన్‌ పెంచాలన్న మీ నిర్ణయంపై మీ పట్ల నమ్మకం, విశ్వాసం మరింత పెరిగాయి, మీరు పేదల కళ్ళలో ఆనందం చూడాలన్న తపనను చూసి సహించలేని కొందరు పచ్చి విషం చిమ్ముతూ ప్రజల్లోకి అవాస్తవాలను పంపుతున్నా, ప్రజలు వాస్తవాలు గుర్తించారు, వారి మనసులో మీరు చెరగని ముద్ర వేసుకున్నారు, ఆ ఫలాలు వారికి అందాయి, ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు, సామాజిక న్యాయం, సాధికారత మీ వల్లే సాధ్యమని నమ్ముతున్నారు, ఎప్పటికీ మీరే మాకు సీఎంగా ఉండాలని, ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 

అన్ని పథకాలు అందుతున్నాయి జ‌గ‌న‌న్న‌: ఖాజా హుస్సేన్, లబ్ధిదారుడు, కల్లూరు, పాణ్యం నియోజకవర్గం

సార్‌ నమస్కారం, నాకు రెండేళ్ళుగా వాహనమిత్రా సాయం అందింది, కానీ ఈ ఏడాది రాలేదు కారణం అడిగితే కరెంట్‌ మీటర్‌ డబుల్‌ గా ఉండటం వల్ల రాలేదన్నారు, మాకు మీ ద్వారా అన్ని పథకాలు అందుతున్నాయి, మా ఆటో కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు, మా అమ్మకు కూడా పెంచిన ఫించన్‌ రూ. 3 వేలు అందుతుంది, మీరు చల్లగా ఉండాలి.

మేం ధన్యులం: శాంతి శ్రీ, లబ్ధిదారు, హుకుంపేట, రాజమండ్రి రూరల్‌

జగనన్నా నమస్తే, బావున్నారా అన్నా, అన్నా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు, నేను కాపు నేస్తం 3 విడతలు తీసుకున్నా, నాలుగో విడత రాలేదు, కరెంట్‌ బిల్లు సమస్య వల్ల రాలేదన్నారు, వలంటీర్‌ వచ్చి సచివాలయంలో అన్నీ సరిచేసి మళ్ళీ వచ్చిందని చెప్పారు, నాకు సంక్రాంతి పండుగ ముందుగా వచ్చినంత ఆనందం ఉంది, కాపు నేస్తం పథకం మమ్మల్ని ఆదుకుంది, కాపులను ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా మీరు గుర్తుపెట్టుకుని మాకు సాయం చేశారు, మేం ధన్యులం, కాపునేస్తం డబ్బుతో నేను కుట్టుమిషన్‌ కొనుక్కుని జీవనం సాగిస్తున్నాను, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భర్త వికలాంగుడు, నా భర్తకు వికలాంగ ఫించన్‌ ఇస్తున్నారు, నాకు కొడుకులు లేరు, నా కొడుకే పెన్షన్‌ ఇస్తున్నాడా అని ఆనందపడుతున్నాం, నాకు అన్ని ప్రభుత్వ పథకాలు అందాయి, నా భర్తకు ఏడాది క్రితం హార్ట్‌ ఎటాక్‌ వస్తే చాలా కంగారుపడ్డాం, ఆరోగ్యశ్రీ కింద లక్ష రూపాయల ఉచిత వైద్యం అందించారు, మీరు చాలా సాయం చేశారన్నా, మాలాంటి అనేకమంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఈ ఐదేళ్ళలో నేను రూ. 3.50 లక్షలు మీ ద్వారా లబ్ధిపొందాను, మా కాపు అక్కచెల్లెమ్మలు అంతా మీ వెంటే ఉంటారు, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం, ధ్యాంక్యూ అన్నా.  

ఈ సాయం నా జీవితానికి చాలా ఉపయోగకరం: సాయి ప్రత్యూష, లబ్ధిదారు, శ్రీకాకుళం 

జగనన్నా నమస్కారం, నేను డిగ్రీ పూర్తిచేశాను, మా నాన్న చిన్న బట్టల షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు, అమ్మ చనిపోయారు, నేను ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇంకా పై చదువులు చదవాలనుకున్నా దూరమయ్యాను, నేను టైలరింగ్‌ వృత్తిని ఎంచుకున్నాను, మా వలంటీర్‌ వచ్చి జగనన్న చేదోడు పథకం కింద సాయం చేస్తున్నారని చెప్పారు, నేను లబ్ధిపొందాను, ఈ డబ్బుతో నేను వ్యాపారాన్ని పెంచుకున్నాను, నేను ట్యూషన్స్‌ చెప్పుకుంటూ, టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మీరు ఇచ్చే ఈ సాయం నా జీవితానికి చాలా ఉపయోగకరం, ఈ డబ్బు కొందరికి చిన్న సాయం అవ్వచ్చు, ఈ పెట్టుబడితో నా కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా, నా సొంతింటి కల కూడా మీ వల్ల నెరవేరింది, త్వరలో గృహప్రవేశం కూడా చేస్తాం, ఇది నూతన సంవత్సర కానుకగా భావిస్తున్నా, నాకు అమ్మ లేని లోటును అన్నగా మీరు తీరుస్తున్నారు, దిశ యాప్‌ భరోసాతో ఒంటరిగా బయటికి వెళుతున్నాను, ఒక్క రూపాయి లంచం లేకుండా అన్నీ అందుతున్నాయి, మిమ్మల్ని మేం సీఎంగా గెలిపిస్తాం, మీరే మళ్ళీ సీఎంగా రావాలి, ధ్యాంక్యూ అన్నా.

Back to Top