టీడీపీ నేతలకు కష్టమొస్తే జనం తిరగబడాలా? బాబు గారూ!

రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేకుండానే అన్నేళ్లు పాలించారా? 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి 

తాడేప‌ల్లి:  తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఒకరిని నేరారోపణపై ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేస్తే–ప్రజలు ఇక తిరగబడతారు, అంటూ హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు. నేరం చేశారనే అభియోగం వచ్చిన వ్యక్తి మాజీ మంత్రి అయినా, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయినా ప్రాథమిక సాక్ష్యాధారాలుంటే అరెస్టు, కోర్టులో హాజరు, రిమాండు–ఇదంతా చకచకా జరిగిపోయే నేర విచారణ ప్రక్రియలో భాగం. ఆరోపణలు ఎదుర్కొనే నాయకుడికి అన్యాయం జరిగితే ఆదుకోవడానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం కక్షగట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటే జిల్లా స్థాయి నుంచి ఢిల్లీ వరకూ నిరపరాధులైన  అమాయకులను కాపాడడానికి కోర్టులు ఉన్నాయి. అలాంటప్పుడు తన పూర్వ కేబినెట్‌ సహచరుడిపై కేసు నమోదయి, అరెస్టయ్యాక కోర్టుకు పోవాల్సివస్తే –మాజీ ముఖ్యమంత్రి గారు ఇంత అడ్డగోలుగా మాట్లాడడం ఆయన అరాచక మానసిక ధోరణికి అద్దంపడుతోంది. ఇలాంటి పరిణామాలు జరిగిన ప్రతిసారీ ‘మేం 18 నెలల్లో అధికారంలోకి వస్తున్నాం. ఇలా తప్పులు చేసే అధికారుల భరతం పడతాం. అక్రమాలు చేస్తున్న అధికారులంతా జైలుకు పోతారు, జాగ్రత్త,’ అనే ధోరణిలో బెదరించడం చంద్రబాబు గారికి ఈమధ్య బాగా అలవాటయింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఉద్యోగులు పాలకపక్షం చెప్పిన పనులన్నీ చేయరు. ముఖ్యంగా, చట్టం అమలు చేసే ప్రభుత్వ విభాగాల అధికారులు తమ పాలకుల మీద కన్నా తమ ఉద్యోగాల మీదే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. కాబట్టి తమ టీటీడీ నాయకులు, కార్యకర్తలు తప్పులు చేసినప్పుడు అరెస్టు చేసి, న్యాయస్థానాలకు తరలించే పోలీసు అధికారులను నాలుగున్నర దశాబ్దాల అనుభం ఉన్న రాజకీయ నేత నారా వారు ఇలా బెదిరించడం ఏ మాత్రం పద్ధతిగా లేదు. తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం, హేపెనింగ్‌ సిటీ హైదరాబాద్‌లో ‘విస్తృత పాలనా అనుభవం’ కష్టపడి సంపాదించిన చంద్రబాబు నాయుడు ఇలా అస్తమానం, ‘మేం అధికారంలోకి వస్తే, మీ అధికారులకు మూడిందే. చట్టప్రకారం వీరిని ఎవరినీ వదిలిపెట్టబోం, ఇక చూసుకోండి,’ అనే బెదిరింపు శైలిలో మాట్లాడడం తెలుగు రాజకీయాలకు శోభనివ్వవు. క్రిమినల్‌ కేసుల్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కునేవారు సొంత పార్టీవారైనప్పుడు చంద్రబాబు వంటి బడా రాజకీయ నేతలు ఇలా మాట్లాడడం సమన్యాయ పాలనకు దోహదం చేయదని గుర్తిస్తే మంచిది.

తాజా వీడియోలు

Back to Top