శంకుస్థాపనల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు..

హైకోర్టును అమరావతికి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టంలేదు..

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి...

పార్లమెంటు ఆవరణలో వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాటం కొనసాగిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం పార్లమెంటులో ఆందోళన చేపట్టింది. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు భవనాల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా హైకోర్టు భవనం నిర్మించలేదని ఎద్దేవా చేశారు.

హైకోర్టును హైదరాబాద్‌ నుంచి అమరావతికి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి సరిగా అమలు కాలేదని విమర్శించారు. శంకుస్థాపనలతో చంద్రబాబు జనాలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రతి రాజకీయ పార్టీతో కాపురం చేశారని.. ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు పవన్‌తో గతంలో వివాహం చేసుకుని విడాకులు ఇచ్చి.. మళ్లీ పవన్‌ను వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు నారా పవన్‌ రాహుల్‌ నాయుడని సముచితమైన పేరు ఉందని వ్యాఖ్యానించారు. 

జనసేనలో టీడీపీ కోవర్టులు..
చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల రాజకీయం అన్ని వేళలా, అంతటా పనిచేయదని విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చంద్రబాబు వ్యవహర శైలిపై మండిపడ్డారు. ఖమ్మంలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్‌లో చేరిపోమంటున్నారని ఆరోపించారు. తన కోవర్టులను కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించి ఆ పార్టీని నాశనం చేశారని అన్నారు. జనసేనలోకి కూడా తన కోవర్టులను పంపించి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Back to Top