చరిత్రపుటల్లో నిలిచిపోయేలా సీఎంకు స్వాగతం పలుకుదాం

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించిన తరువాత మొటిసారి రాక

రూ.1290 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

సీఎంకు స్వాగతం పలుకుతూ 24 కిలోమీటర్ల మేర మానవహారం

విశాఖ ఉత్సవ్‌లో తొలిసారి లేజర్‌షో.. నవరత్నాలపై ప్రదర్శన

విశాఖలో ఒక్క ప్లాట్‌ తప్ప ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లేవు

నా పేరుతో ఎవరైనా ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేస్తే క్రిమినల్‌ కేసులు పెట్టండి

సీపీ, జీవీఎంసీ కమిషనర్, కలెక్టర్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

విశాఖపట్నం: ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రకటించిన తరువాత మొదటి సారి విశాఖకు  వస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చరిత్రపుటల్లో నిలిచిపోయేలా స్వాగతం పలుకుదామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. 28వ తేదీన విశాఖ ఉత్సవ్‌లో సీఎం పాల్గొంటారని, సీఎం విశాఖ పర్యటనలో భాగంగా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి భారీ ఏర్పాట్లు చేపట్టామని ఆయన వివరించారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహిస్తామన్నారు. ఇందుకు సహకరించిన జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ కమిషనర్, చైర్మర్, పోలీస్‌ కమిషనర్, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ ఉత్సవ్‌లో తొలిసారి లేజర్‌షో ఏర్పాటు చేశామని, దాంట్లో నవరత్నాల ప్రదర్శన ఉంటుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రూ.1290 కోట్లతో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

‘ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన తరువాత 28వ తేదీన సీఎం వైయస్‌ జగన్‌ మొట్టమొదటి రాక కాబట్టి మరచిపోలేని విధంగా, చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ నిర్ణయం సామాన్యమైంది కాదు. దీనికి సంబంధించి చాలా మంది అడ్డుపుల్ల వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలను అధిగమిస్తూ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా పూర్తిస్థాయిలో దేశంలో అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర, ఆంధ్ర‡ప్రజానీకంపై ఉంది.

నిన్నటి రోజు వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తరుఫునే కాకుండా, పార్టీ తరుఫున ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి జీవీఎంసీ అభివృద్ధికి రూ.900 కోట్లుకు, వీఎంఆర్‌డీఏ వర్క్స్‌కు సంబంధించి రూ. 385 కోట్లు అన్నీ కలిపి మొత్తం రూ.1290 కోట్లకు పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి కైలాసగిరి వరకు, కైలాసగిరి నుంచి సెంట్రల్‌ పార్కు వరకు, సెంట్రల్‌ పార్కు నుంచి ఆర్కే బీచ్‌ వరకు విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ బహుమానాన్ని స్వాగతిస్తూ ప్రజలందరి కోరిక మేరకు మానవహారంలా ఏర్పడి సీఎంకు స్వాగతం పలుకనున్నాం. మానవహారం అంటే చేయీచేయీ పట్టుకుంటారు. కానీ మనిషి పక్కనే మనిషి ఎటువంటి గ్యాపు లేకుండా మానవహారం నిర్వహిస్తాం. కాన్వాయ్‌లో సీఎం ఎడమ వైపు కూర్చుంటారు కాబట్టి ఎడమ వైపు మానవహారం 24 కిలోమీటర్ల మేర ఉంటుంది. సీఎంకు స్వాగతం చెబుతూ కృతజ్ఞతలు తెలుపుకోవాలనే ఉత్తరాంధ్ర, గోదావరి ప్రజల కోరిక మేరకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. 

సీఎంకు పలికే స్వాగతం చరిత్రలో ఒక మహోత్తరమైన ఘట్టంగా నిలిచిపోవాలనేది మా ఆకాంక్ష. దీనికి దారిపొడవునా.. స్వాగతతోరణాలు కట్టడం జరుగుతుంది.  ఆత్మీయత, అభిమానంతో సీఎంను స్వాగతించేందుకు వచ్చిన ప్రజలు, కార్యకర్తలు  డిసిప్లేన్డ్‌గా నిలబడి రోడ్డుపైకి రాకుండా బాధ్యత తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు. మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా జరపాలనేది మా ధ్యేయం. 24 కిలోమీటర్ల కాన్వాయ్‌ ఫాస్టుగా పోలేదు కాబట్టి కొంచెం లేటు అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలుపెట్టి 6 గంటల వరకు ముగిస్తాం. ఇందుకు అధికారులు కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది.
 
ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌కు సంబంధించి ఇది ప్రథమ భాగం మాత్రమే.. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతాం. ప్రతి సంవత్సరం జరిగే విశాఖ ఉత్సవ్‌లో ఈసారి లేజర్‌ షోను ఏర్పాటు చేయాలనుకున్నాం. అందుకు సీఎం ఒప్పుకున్నారు. లేజర్‌షో 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. దీంట్లో బ్యాక్‌ డ్రాప్‌లో ఏపీ ముఖచిత్రం, ఒకపక్క సీఎం వైయస్‌ జగన్‌ ఫొటో, మరోపక్క దివంగత మహానేత వైయస్‌ఆర్‌ చిత్రం, మధ్యలో ప్రభుత్వ నవరత్నాల కార్యక్రమాలు వివరిస్తూ లేజర్‌ షో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన తరువాత చాలా మంది కొన్ని అంశాలను నా దృష్టికి తీసుకువచ్చారు. మీ పేరు ఉపయోగించుకొని అధికారులకు చెప్పి ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని, వాటిల్లో మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పి మీ పేరును దుర్వినియోగం చేయడం జరుగుతుందని కొందరు నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు వరకు ఏ ప్రాపర్టీ విషయంలో ఏ ఒక్క అధికారికి కూడా నేను ఫోన్‌ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా నేను చెప్పను. ఇది నా ప్రిన్సిపుల్స్‌కు విరుద్ధం. చట్ట ప్రకారం అధికారులు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. న్యాయం వాళ్లే చేస్తారు.. దీంట్లో రాజకీయం జోక్యం అవసరం ఉందని భావించడం లేదు. ఎవరైనా నా పేరు చెప్పి అధికారుల దగ్గరకు వస్తే వెంటనే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదు. విశాఖ ప్రజలు శాంతికాముకులు. ఎప్పుడూ గత ఐదారు సంవత్సరాలుగా ల్యాండ్‌ మాఫియా జరుగుతుందని తెలుసు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉద్యమాలు కూడా చేపట్టాను. ఎవరు భూదందాలు చేశారనేది నాకు పూర్తిగా తెలుసు. అటువంటిది అధికారంలోకి వచ్చిన తరువాత మనమే చేస్తే ప్రజలు దాన్ని హర్షించరు. మనం అటువంటివి చేయకూడదనే ధ్రుడనిశ్చయంతో ఉన్నాను. 

నాకు విశాఖలో మూడు బెడ్‌రూంల ఒక ప్లాట్‌ తప్ప ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లేవు. కుటుంబ సభ్యుల పేరుతో కూడా లేవు. ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ సెటిల్‌మెంట్‌లో తలపెట్టే ప్రయత్నం చేయను. ఓ వెంచర్‌లో భాగస్వామ్యం పెట్టుకునే ఉద్దేశం కూడా లేదు. కమిషనర్‌కు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను.. అటువంటిది మీ దృష్టికి వస్తే వెంటనే క్రిమినల్‌ కేసులు పెట్టాలి’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top