చట్టాన్ని అతిక్రమించేవారిపై చర్యలు తీసుకోవాలి

ప్రజాశాంతి పార్టీ సింబల్‌ మార్చాలి

పోలీసులతోనే డబ్బులు మూటలు తరలిస్తున్న టీడీపీ

వైయస్‌ఆర్‌ సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌లు చేస్తున్న పోలీసులు

పోలీసులు, టీడీపీ అక్రమాలపై సాక్షాధారాలతో సహా ఈసీకి వివరించాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్వి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

ఢిల్లీ: పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసి చంద్రబాబు తన ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయాసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఎలక్షన్‌ కోడ్‌ అతిక్రమిస్తున్న తెలుగుదేశం పార్టీపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో నగదు తరలిస్తున్నారని, సాక్షాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీని కలిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ ఠాకూరు నియామకంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులు ఏబీ వెంకటేశ్వర్‌రావు, ఘట్టమనేని శ్రీనివాసరావు, యోగానంద్, విక్రాంత్‌పాటిల్‌లు చంద్రబాబు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్నారు. ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నారో వారిని తొలగించాలని విజ్ఞప్తి చేశామన్నారు. 

37 మందిని చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా ప్రమోట్‌ చేసి కొంత మందిని సూపర్‌ న్యూమరీ ద్వారా ఎలివేట్‌ చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, విజయనగరం ఎస్పీ దామోదర్‌నాయడు వీరంతా నాన్‌కేడర్‌ ఆఫీసర్లు అక్కడ పోస్టు చేయడం నిబంధనలకు వ్యతిరేకమని, వారిని తొలగించాలని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదే విధంగా పోలీసు యంత్రాంగం ద్వారా డబ్బులు ఎలా తరలిస్తున్నారో సాక్షాధారాలతో ఎలక్షన్‌ కమిషన్‌కు వివరించడం జరిగిందన్నారు. 

శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి మురళీకి సంబంధించిన డబ్బు నారాయణ కాలేజీ నుంచి తీసుకొని వస్తుండగా కారును తనిఖీ చేశారని, వెంటనే ఎమ్మార్వో, ఎస్పీ అక్కడకు చేరుకొని దాంట్లో ఉన్నది నగదు కాదు. అదంతా ఎలక్షన్‌ మెటీరియల్‌ అని సిబ్బందిని బుకాయించి పంపించిన విధానాన్ని ఎలక్షన్‌ కమిషన్‌కు వివరించామన్నారు. అదే విధంగా వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం అనుసరిస్తున్న విధానాన్ని ఈసీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. 

మరో రెండు ముఖ్య విషయాలను ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి వచ్చామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్‌ టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని సాక్షాధారాలతో ఈసీకి అందించామన్నారు. పోలీసు అధికారులు ట్యాపింగ్‌కు పాల్పడుతున్నామని రాసిన లెటర్‌ను ఈసీకి అందించడం జరిగిందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పొలిటికల్‌ అడ్వయిజర్‌ సజ్జల రామకృష్ణారెడ్డిల టెలిఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని సాక్షాలను అందించడం జరిగిందన్నారు. వీరిద్దరే కాకుండా ఆంధ్రరాష్ట్రంలో చాలా మంది ఫోన్లను చంద్రబాబు ట్యాపింగ్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు. వాటిని కూడా ఎలక్షన్‌ కమిషన్‌కు వివరించడం జరిగిందన్నారు. 

ప్రజాశాంతి అని పార్టీ పెట్టి కేఏ. పాల్‌ అనే వ్యక్తి రోజూ కామెడీ చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి కేటాయించిన ఈసీ కేటాయించిన గుర్తు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తును పోలి ఉండడంతో గతంలో ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, మరోసారి ఆ విషయాన్ని పరిశీలించాలని కోరామన్నారు. చంద్రబాబుకు, కేఏ.పాల్‌ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని, అందుకే ప్రజాశాంతి పార్టీ కండువా  రంగులు కూడా వైయస్‌ఆర్‌ సీపీ కండువాను పోలే విధంగా తయారుచేయించారన్నారు. దీన్ని కూడా ఎలక్షన్‌ కమిషన్‌కు వివరించామన్నారు. దీనిపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు మాత్రమే కాకుండా ఫుల్‌ కమిషన్‌కు నివేదించాలని కోరారని, ఫుల్‌ కమిషన్‌ను అపాయింట్‌మెంట్‌ అడిగామని, సోమవారం 4:30 గంటలకు కమిషన్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఫుల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. 

Back to Top