స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఎందాకైనా పోరాటం 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకిస్తోంది

పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం

ఉక్కు, ఆర్థిక శాఖ మంత్రుల‌ను కలిసి ఏపీ హక్కును వివరిస్తాం 

జంతర్‌మంతర్‌ వద్ద కార్మికుల ధర్నాకు మద్దతు కూడగడతాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

విశాఖ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా పార్టీ సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. నష్టాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి కానీ, ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రంలోని అధికార బీజేపీ సిద్ధాంతాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అయితే నష్టాల్లో ఉన్నాయో.. వాటిని లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని, ప్రైవేటీకరణ చేయడం సబబు కాదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నమ్ముతున్నారన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలంటే.. దానికి ఉన్నటువంటి రుణాన్ని ఈక్విటీ కింద మార్చి రుణభారం, వడ్డీ భారాన్ని తగ్గించాలాన్నారు. దీనికి ముడిసరుకు కోసం క్యాపిటీవ్‌ మైన్స్‌ కేటాయించాలి. ఈ రెండూ చేస్తే నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల్లోకి వస్తుంది. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని వైయస్‌ఆర్‌ సీపీ మొదట్నుంచి చెబుతుందన్నారు.

క్యాపిటీవ్‌ మైన్స్‌కు సంబంధించి బీహార్, ఒడిశా నుంచి ముడి సరుకు తీసుకురావాల్సిన అవసరం లేదని, విశాఖ జిల్లా సాలూరు, ఒడిశా బార్డర్‌లో కొటియా వద్ద ఐరన్‌ మైన్స్‌ ఉన్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. అతి దగ్గరలో ఉన్న క్యాపిటీవ్‌ మైన్స్‌ను కేటాయిస్తే.. అతి తక్కువ ఖర్చుతో ముడిసరుకు లభిస్తుందని కార్మిక సంఘాల నాయకులకు చెప్పడం జరిగిందన్నారు. దీని కోసం వైయస్‌ఆర్‌ సీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ కార్మిక సంఘాల నాయకులతో చర్చించామన్నారు.  రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఏం చేయాలనేది వివరంగా చర్చించామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.  

కార్మిక నేతలతో సుదీర్ఘ చర్చలో తీసుకున్న నిర్ణయాలు..
– నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉక్కు శాఖ మంత్రి రాంచంద్రసింగ్‌ను కలిసి విశాఖ ఉక్కు గురించి వివరించి, వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. 
– ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి ఏపీ గళాన్ని వినిపించాలని నిర్ణయించాం. 
– బీజేపీయేతర పక్షాలను కలిసి వారి సహాయ, సహకారాలు తీసుకొని రాజ్యసభ, లోక్‌సభలో మన గళం వినిపించేందుకు పోడియం దగ్గరకు వెళ్లి కార్యకలాపాలను స్తంభింపజేస్తేనే అధికార పక్షానికి మన నిరసన తెలుస్తుందని నిర్ణయించాం. దీనికి కార్మిక సంఘాల నాయకులు అంగీకరించారు. 
– జంతర్‌మంతర్‌లో రెండ్రోజుల పాటు ధర్నా చేయాలని కార్మిక సంఘ నాయకులు నిర్ణయించారు. దానికి ప్రతిపక్షంలోని అన్ని రాజకీయ పార్టీల సంఘీభావం తెలిపించే ప్రయత్నం జరుగుతుంది. 
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించే దిశలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్మిక సంఘ నేతలకు పూర్తిగా సహాయ, సహకారాలు అందిస్తుంది. పార్లమెంట్‌ సభ్యులంతా చిత్తశుద్ధితో కృషిచేస్తామని తెలియజేశాం.
– ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని, సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా నమ్ముతుంది. దాని కోసం ఎందాకైనా పోరాడుతాం’ అని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. 
 

Back to Top