తక్షణ వరద సాయం రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి

ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 6,054 కోట్ల పంట, ఆస్తి నష్టం

వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్దఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలు

సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసం

వరద సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తక్షణసాయం ప్రకటించండి

రాజ్యసభ జీరో అవర్‌లో కేంద్రానికి ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని నాలుగు రాయలసీమ జిల్లాలలోపాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాలతో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల అంశాన్ని రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తారు. నవంబర్‌ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, వైయస్‌ఆర్‌ కడప, అనంతపురం జిల్లాలను కనివినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయని, వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిందన్నారు. 

వరదల వల్ల సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 16 మంది ఆచూకీ దొరకలేదని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. ఇళ్లు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారని, రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు, విద్యుత్‌ లైన్లు, స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయని, వరదలు ముంచెత్తడంతో కొన్ని జలాశయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట వరద నీటిలో కొట్టుకుపోయిందని, సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసమైపోయాయని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి వివరించారు.  

ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 6,054 కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. వరదలతో అతలాకుతలమైపోయిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను ప్రారంభించిందని, సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top