8 ఏళ్ళలో పోలవరంకు ఇచ్చింది రూ.11182 కోట్లు

రాజ్యసభలో  వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం 11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు మాత్రమే ఈ నిధుల విడుదల జరిగినట్లు ఆయన తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తం 55 వేల 657 కోట్లు ఖర్చవుతుందని సవరించిన అంచనాలు చెబుతుంటే ఎనిమిదేళ్ళ వ్యవధిలో  కేంద్రం ఇచ్చింది కేవలం 11,182 కోట్ల రూపాయలు మాత్రమేనని మంత్రి తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గురువారం రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

రాజధాని నగరం(అమరావతి)లో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం 2014 నుంచి 2017 మధ్య కాలంలో కేంద్ర సహాయం కింద 2,500 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర గ్రాంట్‌ కింద 2014 నుంచి ఇప్పటి వరకు రూ.1750 కోట్లు విడుదల అయ్యాయి. వనరుల మధ్య ఏర్పడిన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు 2014 నుంచి 2017 మధ్య కాలంలో ప్రత్యేక సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3979 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం కింద ఇచ్చిన హామీలలో భాగంగా నెరవేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల వివరాలను కూడా మంత్రి సవివరంగా తన జవాబులో పొందుపరచారు. ఏప్రిల్‌ 2018 నుంచి మార్చి 2019 వరకు రాష్ట్రంలో 88 కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల అమలు కోసం 10,632 కోట్ల రూపాయలు విడదలైనట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు రాష్ట్రంలో 84 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం 11,112 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 వరకు 79 కేంద్ర పథకాల అమలు నిమిత్తం 12,904 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఏప్రిల్‌ 2021 నుంచి జూలై 2021 వరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న 31 కేంద్ర పథకాల కోసం 1,794 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

వ్యాజ్యాలపై నిర్ణయాధికారం న్యాయ వ్యవస్థదే...
ప్ర‌జా ప్రయోజన వ్యాజ్యాలపై నిర్ణయాధికారం న్యాయ వ్యవస్థదేనని న్యాయ శాఖ మంత్రి  కిరణ్‌ రిజుజు రాజ్యసభలో స్పష్టం చేశారు. అప్రాధాన్యమైన అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు అవుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాల వలన విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నందున వీటని అరికట్టేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏవైనా నిర్ధిష్టమైన చర్యలు తీసుకోబోతున్నదా అని  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ పాలనాపరమైన చర్యలకు వ్యతిరేకంగా ఏ పౌరుడైనా న్యాయపరమైన పరిష్కరాన్ని  పొందే హక్కును రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఫలానా పాలనాపరమైన చర్యకు వ్యతిరేకంగా కేసు పెట్టాలా వద్దా అన్న స్వేచ్ఛ పౌరుడికి ఉంటుంది. ఈ హక్కును వినియోగించుకుని దాఖలు చేసే ప్రజా ప్రయోజన వ్యాజ్యం చట్ట పరిధిలో ఉన్నదో లేదో నిర్ణయించే సంపూర్ణ అధికారం న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉందని మంత్రి వివరించారు.

విశాఖలో ట్రైబ్యునల్‌ ప్రతిపాదన లేదు...
విశాఖపట్నంలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని ప్రధాన మంత్రి కార్యాలయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పదవీ విరమణ చేసిన వారితో సహా వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ టైబ్యునల్‌ను నగరంలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా అని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా జవాబిచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఉన్నచోట కేంద్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికపైన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను నెలకొల్పవచ్చు. ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడి శాశ్వత బెంచ్‌ ఏర్పాటు ఆవశ్యకత, కేసుల పరిష్కారం వంటి అంశాల ప్రాతిపదికపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

Back to Top